Boney Kapoor About Love With Sridevi: అప్పట్లో శ్రీదేవి, బోనీ కపూర్ వివాహం ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలామంది సినీ సెలబ్రిటీలకు శ్రీదేవి అంటే క్రష్ ఉండేది. అంతే కాకుండా వారిలో కొంతమంది తనను పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడేవారు. కానీ తను మాత్రం అప్పటికే పెళ్లయిన బోనీ కపూర్‌తో ప్రేమలో పడి, ఆయనను వివాహం చేసుకుంది. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్.. వారి పెళ్లికి ముందు జరిగిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన మొదటి భార్య మోనా షోరీతో శ్రీదేవితో ప్రేమలో పడిన విషయాన్ని ఎలా ఓపెన్‌గా చెప్పేశారో కూడా బయటపెట్టారు.


అమ్మ రాఖీ కట్టమంది..


‘‘నాకు శ్రీదేవిపైన ఫీలింగ్స్ ఉన్నాయని మా అమ్మకు అర్థమయిపోయింది. అందుకే రాఖీ రోజున తను శ్రీదేవికి రాఖీ ఇచ్చి నాకు కట్టమని చెప్పింది. అప్పుడే శ్రీదేవి రూమ్‌లోకి వెళ్తే నేను తన వెనకే వెళ్లి కంగారు పడకు, భయపడకు, ఈ రాఖీని ఇక్కడే పెట్టేయమని చెప్పాను. అసలు అప్పుడు ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదు’’ అంటూ ఫన్నీ సంఘటనను గుర్తుచేసుకున్నారు బోనీ కపూర్. ‘‘శ్రీదేవిపై నాకు మొదటినుండి ప్రేమ ఉంది. సుమారు 5, 6 ఏళ్లుగా తనతో ఈ విషయాన్ని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండేవాడిని’’ అని చెప్పుకొచ్చారు బోనీ కపూర్.


నిజాయితీగానే ఉన్నాను..


శ్రీదేవిని కలవడానికి ముందే బోనీ కపూర్‌కు మోనా షోరీతో వివాహం జరిగిపోయింది. మోనా షోరీతో హ్యాపీ మ్యారేజ్‌లో ఉన్న సమయంలోనే తనకు శ్రీదేవిపై ప్రేమ ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని తన భార్యతో ఓపెన్‌గానే చెప్పేశానని బోనీ కపూర్ తెలిపారు. ‘‘నాకు ఇప్పటికీ తప్పు చేసినట్టుగానే అనిపిస్తుంది. కానీ నా భార్య మోనాతో మాత్రం నేను నిజాయితీగానే ఉన్నాను. నేను శ్రీదేవి గురించి ఎలా ఫీల్ అవుతున్నానో తనకు అర్థమయిపోయింది. మాకు పెళ్లి అవ్వకముందే శ్రీదేవి వచ్చి మా ఇంట్లో ఉంది. తన సౌకర్యం కోసం నేను చాలా చేశాను. అదంతా మోనా గమనించింది’’ అంటూ చెప్పుకొచ్చారు బోనీ కపూర్. మొత్తానికి శ్రీదేవిపైన అమితంగా ఇష్టం పెంచుకున్న బోనీ.. చివరికి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి వివాహం కూడా చేసుకున్నారు.


ఇండస్ట్రీలో ముగ్గురు వారసులు..


1983లో ముందుగా మోనాను పెళ్లి చేసుకున్నారు బోనీ కపూర్. 1996 వరకు తనతో కలిసున్నారు. అదే ఏడాది తనకు విడాకులు ఇచ్చేసి శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారు. అప్పటికే మోనా, బోనీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారే అర్జున్ కపూర్, అన్షులా కపూర్. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరికీ ఇద్దరు కూతుళ్లు జన్మించారు. వారే జాన్వీ కపూర్, ఖుషి కపూర్. ప్రస్తుతం అర్జున్ కపూర్, జాన్వీ, ఖుషి.. ముగ్గురూ బోనీ కపూర్ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటులుగా తమకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అర్జున్, జాన్వీ బీ టౌన్‌లో గుర్తింపు తెచ్చుకున్నా ఖుషి మాత్రం ఇంకా ప్రయత్నాల్లోనే ఉంది.


Also Read: రూ.1000 కోట్లతో అమీర్ ఖాన్ ‘మహాభారత్’ - షారుఖ్, సల్మాన్ పాత్రలు ఇవేనట!