Aamir Khan's Mahabharat: సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్.. ఇలా బాలీవుడ్‌కు చెందిన ముగ్గురు బడా సూపర్ ఖాన్స్‌ను ఒకే స్క్రీన్‌పై చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో ముగ్గురు ఖాన్స్ రెడీగా ఉన్నా.. తాము కలిసి నటించే ప్రాజెక్ట్ చాలా బాగుండాలని ఎదురుచూస్తున్నట్టు ఈ ముగ్గురు పలు సందర్భాల్లో బయటపెట్టారు. అయితే ఆ సమయం వచ్చినట్టే అనిపిస్తోంది. అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం సల్మాన్, షారుఖ్ చేతులు కలపనున్నట్టు బీ టౌన్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అమీర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే మరెదో కాదు.. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ‘మహాభారత్’.


అమీర్ తలచుకుంటే సాధ్యం..


తను సినిమాల నుండి రిటైర్ అయ్యే పరిస్థితి వస్తే ‘మహాభారత్’ను తెరకెక్కించిన తర్వాతే రిటైర్ అవుతానని అమీర్ ఖాన్ ఇప్పటికే చాలాసార్లు బయటపెట్టాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ కూడా సినిమాల నిర్మాణంలో యాక్టివ్ అవ్వడంతో త్వరలోనే ‘మహాభారత్’ గురించి క్లారిటీ వస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే బీ టౌన్‌లో ఒక ఆసక్తికర చర్చ మొదలయ్యింది. అమీర్ ఖాన్ తలచుకుంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను ‘మహాభారత్’లో నటించడం కోసం ఒప్పించగలడు అని ఫ్యాన్స్‌లో చర్చ జరుగుతోంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే.. షారుఖ్, సల్మాన్‌లకు మహాభారత్‌లో సరిపోయే పాత్రలు ఏంటో కూడా వారు చర్చించుకుంటున్నారు.


అందరూ స్టార్లే..


‘మహాభారత్’లో పాండవుల్లో ప్రతీ ఒక్క పాత్రకు స్టార్ హీరోను ఎంచుకుంటూ కచ్చితంగా మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు అయితే కర్ణుడు, అర్జునుడు లాంటి పాత్రలకు సరిగ్గా సరిపోతారు. ఇక అమీర్ ఖాన్.. ఈ మూవీకి నిర్మాతే అయినా కూడా కచ్చితంగా తను కూడా నటించడానికి ఒక పాత్రను తప్పకుండా ఎంచుకుంటాడు. అలా అమీర్‌కు కృష్ణుడి క్యారెక్టర్ అయితే బాగుంటుందని బాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ ఈ సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన అమీర్.. ఇప్పటివరకు దీని గురించి ఎలాంటి అప్డేట్ అందించకపోవడంతో ఫ్యాన్స్ అంతా తమకు నచ్చిన రూమర్స్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు.


ఒకే స్టేజ్‌పై స్టెప్పులు..


ఒకానొక సందర్భంలో ముగ్గురు ఖాన్స్ కలిసి వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారు అని షారుఖ్ ఖాన్‌కు ప్రశ్న ఎదురయ్యింది. అయితే తమ ముగ్గురిని భరించే స్థోమత ఏ నిర్మాతకు లేదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ తాజాగా జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఈ ముగ్గురు ఖాన్స్ కలిసి స్టెప్పులేశారు. ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు షారుఖ్, అమీర్, సల్మాన్ కలిసి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అది ఖాన్స్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. కాసేపటి వేడుకలోనే వీరి క్రేజ్ అలా ఉంటే.. ఇంక కలిసి నటిస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ‘మహాభారత్’ను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తానని ప్రకటించిన అమీర్.. దీనిపై అప్డేట్ ఎప్పుడు ఇస్తాడా అని కూడా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇది ఫేక్ వార్త అనే సమాచారం చక్కర్లు కొడుతోంది. దీనిపై అమీర్ అధికారికంగా ప్రకటిస్తేనేగానీ.. క్లారిటీ రాదు.


Also Read: యాంకర్ సుమ మంచి మనసు - 100 పడకల వృద్ధాశ్రమం నిర్మాణం, అండగా ఉంటానంటూ హామీ!