Urvashi Rautela in NBK 109 : టాలీవుడ్ సీనియర్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత రెండు సంవత్సరాలుగా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నాడు. 2023లో 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' లాంటి సినిమాలతో విజయాలు అందుకుని తన మార్కెట్ ని అమాంతం పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ బాబితో లేటెస్ట్ ప్రాజెక్టు చేస్తున్నాడు. 'NBK 109' పేరుతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సదరు హీరోయిన్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.


NBK109 లో లేడి పోలీస్ ఆఫీసర్ గా 'ఊర్వశి రౌతేలా'


బాబీ - బాలకృష్ణ కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో బాలీవుడ్ ఐటమ్ భామ ఊర్వశి రౌటేల ఓ పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తుందట. ఇదే విషయాన్ని ఊర్వశి తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 'NBK109' లో పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నానని, అందుకోసమే ప్రత్యేకంగా జిమ్ ట్రైనర్ పర్యవేక్షణలో వర్కౌట్స్ చేస్తున్నట్లు పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కే పరిమితమైన ఊర్వశి మొదటిసారి బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తుండడం విశేషం. ఊర్వశి ఇప్పటికే వాల్తేరు వీరయ్య, ఏజెంట్, స్కంద, బ్రో వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది. ఇక ఇప్పుడు NBK109 లో పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టబోతోంది.


NBK 109లో విలన్ గా బాబీ డియోల్


గత ఏడాది 'యానిమల్' సినిమాలో విలన్ అదరగొట్టిన బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బాబి డియోల్ 'NBK109' లో విలన్ గా కనిపించనున్నాడు. ఇటీవలే బాబీ డియోల్‌ను మూవీ సెట్‌లోకి ఆహ్వానిస్తూ తాజాగా ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. "హ్యాపీ బర్త్‌డే బాబీ డియోల్‌. వెల్‌కమ్‌ టూ NBK109 సెట్‌" అంటూ అతడికి మూవీ టీం స్వాగతం పలికింది. ఈ అప్‌డేట్‌ చూసి నందమూరి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. సినిమాలో బాలయ్య - బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. డైరెక్టర్‌ బాబీ ఈ మూవీని ఏ లెవల్లో ప్లాన్‌ చేశాడో విలన్ సెలెక్షన్ తోనే అర్థమవుతోంది.


బాలకృష్ణ సరసన మీనాక్షి చౌదరి


ఇటీవల 'గుంటూరు కారం' సినిమాలో మహేష్ మరదలి పాత్రలో ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి 'NBK109' లో బాలకృష్ణ సరసన కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈమెతో పాటు తెలుగమ్మాయి హీరోయిన్ చాందిని చౌదరి కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. థమన్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : సుకుమార్‌పై అల్లు అర్జున్ ఆగ్రహం? విభేదాలకు కారణాలేమిటీ?