Pushpa 2 Release Date: ఇప్పటికే టాలీవుడ్ నుంచి ఎన్నో పాన్ ఇండియా సీక్వెల్స్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. అందులో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ కూడా ఒకటి. ఈ సినిమా మొదటి భాగమైన ‘పుష్ప ది రైజ్’ ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే దీని సీక్వెల్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. కానీ ‘పుష్ప ది రూల్’ మాత్రం పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. ఇదే సమయంలో అల్లు అర్జున్, సుకుమార్ విభేదాలు కూడా వస్తున్నట్టు టాలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 


ఆగస్ట్ 15 కోసం వెయిటింగ్..


2021 డిసెంబర్‌లో ‘పుష్ప ది రైజ్’ విడుదలయ్యింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ప్రీ ప్రొడక్షన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాడు దర్శకుడు సుకుమార్. ‘పుష్ప పార్ట్ 1’ కంటే పార్ట్ 2ను మరింత భారీ ఎత్తులో నిర్మించాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకూడదని జాగ్రత్తపడుతున్నాడు. ఇదే క్రమంలో ‘పుష్ప 2’ షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఎంత లేట్ అయినా కూడా 2023 డిసెంబర్‌లో ‘పుష్ప 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అది కూడా కుదరలేదు. ఏకంగా 2024 ఆగస్ట్ 15కు మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్‌లో నిరాశ ఎక్కువయ్యింది. 


ఆ విషయంలో అల్లు అర్జున్ సీరియస్..


మామూలుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన సినిమాకు ఒక విడుదల తేదీని ప్రకటిస్తే.. కచ్చితంగా అదే రోజు మూవీ ఎట్టి పరిస్థితుల్లో విడుదల అవ్వాలని కోరుకునే వ్యక్తి. కానీ తన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పుష్ప 2’ విషయంలో మాత్రం అది జరగడం లేదు. ఏదో ఒక విధంగా షూటింగ్ లేట్ అవ్వడం లేదా షూటింగ్‌కు బ్రేక్ పడడంలాంటివి జరుగుతూనే ఉన్నాయి. దీని వల్ల అల్లు అర్జున్ కూడా సుకుమార్‌పై ఆగ్రహంగా ఉన్నాడని ఫిల్మ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సుకుమార్ అంటే అల్లు అర్జున్‌కు చాలా ఇష్టం. ఇదే విషయం బన్నీ కూడా పలుమార్లు ఓపెన్‌గా చెప్పాడు. కానీ ‘పుష్ప 2’ వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది. 


2025 సమ్మర్‌కే..


ఒకవేళ ఆగస్ట్ 15 లోపు ‘పుష్ప 2’ షూటింగ్ పూర్తి అయ్యి.. విడుదలకు సిద్ధమవ్వకపోతే.. ఇంక ఈ ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు. ఎందుకంటే 2024లో ఇప్పటికే పలుమార్లు సినిమాల విడుదల తేదీల గురించి చర్చలు జరిగాయి. ఉన్న విడుదల తేదీని మిస్ చేసుకుంటే ‘పుష్ప 2’కు మళ్లీ రిలీజ్ డేట్ దొరకడం కష్టమని, దానికోసం కష్టాలు తప్పవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2024 క్రిస్ట్మస్, 2025 సంక్రాంతి పూర్తిగా సినిమాలతో ప్యాక్ అయిపోయింది. అందుకే ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ థియేటర్లలో విడుదల అవ్వకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ తప్పదు. అందుకే వారిని నిరాశకు గురిచేయకూడదని, ఎలాగైనా సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేయాలని బన్నీ ఒత్తిడి చేస్తున్నాడట.


Also Read: ‘గేమ్ ఛేంజర్’ మరింత ఆలస్యం? వినాయక చవితికి కూడా విడుదల కానట్టేనా?