Hrithik Roshan About ‘War 2’ Movie: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ‘వార్ 2’ సినిమా తెరకెక్కబోతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. 2019లో విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న ‘వార్’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఈ చిత్రంలో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లతో ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులలో మరింత కలిగిస్తోంది.
‘వార్ 2’ గురించి హృతిక్ ఆసక్తికర వ్యాఖ్యలు
హృతిక్ రీసెంట్ మూవీ ‘ఫైటర్’ మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వార్ 2’ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఏం ఆశించవచ్చో వివరించారు. ఈ సినిమా అద్భుతమైన స్క్రిప్ట్‌తో తెరకెక్కబోతున్నట్లు తెలిపారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు మెస్మరైజ్ చేస్తాయన్నారు. హై యాక్షన్ సీక్వెన్సులు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని కలిగిస్తాయని చెప్పారు. యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్ అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. అంతేకాదు, ‘RRR’ స్టార్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నందుకు ఉత్సాహంగా ఉందన్నారు.
హీరోగా హృతిక్, విలన్ పాత్రలో ఎన్టీఆర్
‘వార్ 2’ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. 'ఫైటర్' విజయం తర్వాత హృతిక్ మరింత జోష్ తో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. అటు ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఎలాంటి నటన కనబరుస్తారోనని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నార్త్, సౌత్ స్టార్ హీరోలు కలిసి చేస్తున్న ఈ సినిమా తప్పకుండా వెండితెరపై సంచలనాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ప్రేక్షకులకు మరపురాని సినిమాటిక్ అనుభూతిని అందించే అవకాశం ఉంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కథానాయకుడిగా కనిపించనుండగా, జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇక హృతిక్ ‘ఫైటర్’ తర్వాత ‘వార్ 2’కు రెడీ అవుతున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసుకుని ‘వార్ 2’కు రెడీ అయ్యే అవకాశం ఉంది. ఇక ‘వార్ 2’లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం, క్యూట్ బ్యూటీ కియారా అద్వానీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్ వెచ్చిస్తోందట. ఈ యాక్షన్ మూవీని 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.