తెలుగు ప్రేక్షకులకు అర్జున్ దాస్ (Arjun Das) తెలుసు. ఆయన నటనతో పాటు గొంతుకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. తమిళ నటుడు అయినా సరే... కార్తీ 'ఖైదీ', విజయ్ 'మాస్టర్', కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాల్లో చేసిన క్యారెక్టర్లు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చాయి. గతంలో గోపీచంద్ 'ఆక్సిజన్' సినిమాలో ఓ క్యారెక్టర్ చేశారు. 'బుట్ట బొమ్మ'తో గత ఏడాది తెలుగు చిత్రసీమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆయన హీరోగా నటించిన ఓ సినిమా ఈ నెలలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
శంకర్ నిర్మాణంలో అర్జున్ దాస్ హీరోగా...సందేశాత్మక కథలకు వాణిజ్య విలువలు జోడించి భారీ చిత్రాలు తీసే దర్శకుడు శంకర్. ఆయనలో నిర్మాత కూడా ఉన్నారు. కంటెంట్ & కొత్తదనం కూడిన చిన్న సినిమాలను నిర్మిస్తుంటారు. ఎస్ పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ విజయాలు సాధించాయి. 'ప్రేమిస్తే', 'వైశాలి', 'షాపింగ్ మాల్' చిత్రాలు శంకర్ నిర్మించినవే. ఆయన నిర్మించిన తాజా సినిమా 'బ్లడ్ అండ్ చాక్లెట్' (Blood And Chocolate Movie). ఇందులో అర్జున్ దాస్ కథానాయకుడిగా నటించారు.
ఫస్ట్ లుక్ విడుదల చేసిన 'దిల్' రాజు'బ్లడ్ అండ్ చాక్లెట్' సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను అగ్ర నిర్మాత 'దిల్' రాజు విడుదల చేశారు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి జాతీయ పురస్కార గ్రహీత వసంత బాలన్ దర్శకత్వం వహించారు. ఆయన తీసిన 'షాపింగ్ మాల్' సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఇక, ఆది పినిశెట్టి హీరోగా వసంత బాలన్ దర్శకత్వం వహించిన 'ఏకవీర'కు ఫ్యాన్స్ ఉన్నారు.
జూలై 21న 'బ్లడ్ అండ్ చాక్లెట్' విడుదల తెలుగు, తమిళ భాషల్లో జూలై (ఈ నెల) 21న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఎస్.ఆర్.డి.ఎస్ సంస్థ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సంస్థ ఏపీ, తెలంగాణలో చిత్రాన్ని విడుదల చేయనుంది. అర్జున్ దాస్ జోడీగా 'బ్లడ్ అండ్ చాక్లెట్'లో హీరోయిన్ దుసరా విజయన్ నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. సినిమాలో నాలుగు పాటలతో పాటు నేపథ్య సంగీతం హైలైట్ అవుతుందని దర్శకుడు వసంత బాలన్ చెప్పారు. వనితా విజయ్ కుమార్, అర్జున్ చిదంబరం, సురేష్ చక్రవర్తి తదితరులు సినిమాలో నటించారు.
Also Read : 'మాయా పేటిక' రివ్యూ : ఒక్క టికెట్ మీద ఆరు షోలు - సెల్ ఫోన్ బయోపిక్ ఎలా ఉందంటే?
పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో అర్జున్ దాస్‌ఇప్పుడు అర్జున్ దాస్ ఓ వైపు కథానాయకుడిగా నటిస్తూనే... మరోవైపు అగ్ర కథానాయకుల సినిమాల్లో ముఖ్యమైన క్యారెక్టర్లు చేస్తున్నారు. ఇతర సినిమాలను పూర్తిగా పక్కన పెట్టలేదు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో రూపొందుతున్న తాజా సినిమా 'లియో'లోనూ ఆయన ఓ రోల్ చేస్తున్నారు. ఇంతకు ముందు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వహించిన 'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్' సినిమాలు అర్జున్ దాస్‌కు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు 'ఓజీ' కంటే ముందు 'బ్లడ్ అండ్ చాక్లెట్', 'లియో' సినిమాలతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.Join Us on Telegram: https://t.me/abpdesamofficial