బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ , స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ లకు తాజాగా  ముంబై ట్రాఫిక్ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. సోమవారం రోజున అమితాబచ్చన్, అనుష్క శర్మ ఇద్దరు వేరువేరు బైక్స్ పై ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణం చేసినందుకుగాను ముంబై ట్రాఫిక్ పోలీసులు అమితాబచ్చన్, అనుష్క శర్మ లకు జరిమానా విధించారు. సోమవారం రోజు ముంబై ట్రాఫిక్ లో చిక్కుకున్నారు అమితాబ్ బచ్చన్. షూటింగ్ కి లేట్ అవుతుండడంతో ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగి అతని బైక్ పై తన షూటింగ్ లోకేషన్ కు సరైన సమయంలో చేరుకున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


దాంతోపాటు బైక్ పై వెళ్తున్న ఫోటోని కూడా పోస్ట్ చేయగా.. ఆ ఫోటో సోషల్ మీడియా అంతటా క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఈ ఫోటోలో ఉన్న బైక్ రైడర్ తో పాటు అమితాబ్ కూడా హెల్మెట్ ధరించలేదు. దాంతో ఈ ఫోటోని చూసిన చాలామంది నేటిజన్లు ఓ బాధ్యత గల నటుడై ఉండి ఇలా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ట్రాఫిక్ రూల్స్ ని పాటించకపోవడం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో అమితాబ్ బచ్చన్ తో పాటు ఆ బైక్ రైడర్ పై ట్రాఫిక్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. దాంతో ముంబై పోలీసులు అమితాబచ్చన్ కి జరిమానా విధించారు. ఇక మరోవైపు హీరోయిన్ అనుష్క శర్మ కూడా అదే రోజు తన కారును పక్కనపెట్టి తన బాడీగార్డ్ బైక్ పై ముంబై వీధుల్లో తెగ చక్కర్లు కొట్టింది.అందుకు సంబంధించిన ఫోటో కూడా నెట్టింట వైరల్ గా మారింది. దాంట్లో కూడా అనుష్క శర్మ అతని బాడీగార్డ్ హెల్మెట్ ధరించలేదు. దీంతో అనుష్క శర్మ బైక్ రైడింగ్ వీడియోను కొంతమంది నెటిజన్స్ ముంబై ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. ముంబై పోలీసులు సోషల్ మీడియా వేదికగా వాళ్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారి ఫోటోలను కూడా ధ్రువీకరించినట్లు ముంబై పోలీస్ సీనియర్ అధికారులు తెలియజేశారు.ఇక  హెల్మెట్ ధరించినందుకు అనుష్క శర్మ కి ముంబై పోలీసులు చలానా విధించారు. అయితే బైక్ నడిపిన అనుష్క శర్మ బాడీగార్డ్ కి సరైన లైసెన్స్ లేని కారణంగా అతనికి 500 రూపాయలు జరిమానా అలాగే బైక్ యజమానికి 5000 రూపాయల జరిమానా విధించారు. వీటితోపాటు హెల్మెట్ లేనందుకు మరో 500 రూపాయలు జరిమానా విధించారు. ఇక వీరికి విధించిన చలాన్లు సెక్షన్ 129/194(D), సెక్షన్ 5/180 & సెక్షన్ 3(1)181 MV చట్టం కింద జారీ చేయబడింది. ఇక ఇప్పటికే బైక్ యజమానులు ఇద్దరూ ఈ జరిమానాలను  చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అమితాబచ్చన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ ఫిలిం 'ప్రాజెక్ట్ కె' లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే అనుష్క శర్మ 'చెక్దా ఎక్స్ ప్రెస్' అనే సినిమాలో నటిస్తోంది.


Also Read : సల్మాన్ ఖాన్ చెల్లెలి ఇంట్లో చోరీ - ఖరీదైన డైమండ్స్ మాయం!