యంగ్ హీరోల తాకిడికి సీనియర్ హీరోలు తట్టుకోలేరు అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు సీనియర్ హీరోలు సైతం.. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చే పాత్రలు చేస్తూ.. తమ ఏజ్‌కు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికీ కొందరు సీనియర్ హీరోలు విభిన్న కథలను ఎంచుకుంటూ తాము ఎప్పుడూ బెస్ట్ అని నిరూపించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పటికీ తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత చిరుకు కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ బాగా కలిసొచ్చాయి. అందుకే తనకు సక్సెస్‌ను తెచ్చిపెట్టిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ల వైపు తన అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే తన తరువాతి చిత్రం ‘భోళా శంకర్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు చిరు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’.. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరుకు జోడీగా తమన్నా నటించింది. అంతే కాకుండా ఇందులో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేశ్ కనిపించనుంది. వీరితో పాటు సుశాంత్ లాంటి యంగ్ నటుడు కూడా ‘భోళా శంకర్’ క్యాస్టింగ్‌లో భాగమయ్యాడు. రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీముఖి కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది. ఇటీవల ‘భోళా శంకర్’ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ట్రైలర్‌లో ఎప్పటిలాగానే మెగాస్టార్ కామెడీ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇక యాక్షన్ సీన్స్, అందులో బీజీఎమ్ కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉన్నాయని ఫ్యాన్స్ అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టేసుకున్నారు.
U/A ఖరారు
‘భోళా శంకర్’ నుంచి వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సీబీఎఫ్‌సీ బోర్డ్ ‘భోళా శంకర్’కు U/A సర్టిఫికేట్‌ను అందజేసింది. చిరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత అన్ని చిత్రాలకు యూ/ఏ సర్టిఫికేటే అందింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీలతో చిరంజీవి అందరివాడు అనిపించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి చివరిగా ‘వాల్తేరు వీరయ్య’లో నటించారు. ఆ మూవీ కూడా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సూపర్‌హిట్‌ను అందుకుంది. ఇప్పుడు‘భోళా శంకర్’ కూడా అలాగే అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
‘వేదాళం’ రీమేక్‌గా
మెగాస్టార్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత ఎక్కువగా రీమేక్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. ‘భోళా శంకర్’ను కూడా తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా తెరకెక్కించారు. తమిళ స్టార్ అజిత్ ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటించారు. చెల్లెలి సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపిన సినిమానే ‘వేదాళం’. అందుకే ఈ మూవీ కథ మెగాస్టార్‌కు బాగా నచ్చి రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ బాధ్యతను సీనియర్ దర్శకుడు మెహర్ రమేశ్ చేతిలో పెట్టాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్.. ‘భోళా శంకర్’ను నిర్మించారు. రామబ్రహ్మం సుంకర.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. మహతి స్వర సాగర్‌కు తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవిలాంటి స్టార్ హీరో సినిమాకు సంగీతం అందించే అవకాశం దక్కింది.
Also Read: ఆ శ్యాంబాబు.. రాంబాబు కాదు, ఆ పాత్రకు స్ఫూర్తి వేరుకొరు: సాయి ధరమ్ తేజ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial