Bhairavam Official Teaser : బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తెలుగులో సినిమాలు చేసి చాలా కాలమే అవుతుంది. అందుకే గ్యాప్ ఇచ్చి వచ్చినా.. గట్టిగా హిట్ కొట్టాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే భైరవం అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఒక్క టీజర్‌తో భైరవం సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచేశాడు డైరక్టర్. నారా రోహిత్, మంచు మనోజ్‌తో కలిసి బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన చేసిన యాక్షన్ మామూలుగా లేదు. గరుడన్ మూవీ రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమా టీజర్ ఎలా సాగిందంటే..
టీజర్ హైలైట్స్..
జయసుధ అందించిన వాయిస్ ఓవర్‌తో టీజర్‌ను ప్రారంభించారు. ''రాత్రి నాకో కల వచ్చింది. చుట్టూ తెగి పడిన తలలు.. మొండాలు. దూరంగా మృత్యువు తెలియని కాలాన్ని జయించిన కృష్ణుడిలా శంఖం పూరించుకుంటూ వెళ్లిపోతున్నాడురా శ్రీను'' అంటూ వాయిస్ ఓవర్ వస్తుంది. అనంతరం ఒక్కో క్యారెక్టర్ని పరిచయం చేస్తూ టీజర్‌ను చూపించారు. '' ఈ ఊరిని కాపాడడానికి వారాహి అమ్మవారు ఆ అమ్మ గుడిని కాపాడడానికి నానమ్మ ఉండగా మాకేమవుతుందంటూ'' .. నారా రోహిత్ డైలాగ్ చెప్పిన విధానం బాగుంది.
'' శ్రీనుగాడి కోసం నా ప్రాణాలు ఇస్తా.. వాడి జోలికి ఎవడైనా వస్తే కొడకా ప్రాణాలు తీస్తా'' అంటూ మంచు మనోజ్ చెప్పిన డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. '' ఆ రామ లక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే.. ఈ రామ లక్ష్మణులకు ఏమి కాకుండా చూసుకోవడానికి ఈ శ్రీనుగాడు ఉన్నాడు'' అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ డైలాగ్‌తో టీజర్‌ను ముగించారు. మాస్ డైలాగ్స్‌తో పవర్ ఫుల్‌గా సాగింది టీజర్.
గరుడన్‌కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ్లో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి.. తెలుగులో విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధా మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా విడుదలపై చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ సినిమా పూర్తైనట్లు.. చాలా బాగా వచ్చిందని.. బెల్లంకొండ శ్రీను నటన అద్భుతమని.. మనందరికీ మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు మంచు మనోజ్ టీజర్ లాంచ్‌లో తెలిపారు.
సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ముగ్గురు ప్రధాన హీరోలుగా చేస్తున్నారు. ఈ మూవీ ముగ్గురికి కీలకంగా మారనుంది. ఎందుకంటే వీరికి హిట్ వచ్చి చాలాకాలమే అయింది. ఇప్పుడు ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఈ హీరోలు ఎదురు చూస్తున్నారు. హీరోలకు తగ్గట్లుగా నటీనటులను ఎంచుకున్నాడు డైరక్టర్. జయసుధ, డైరక్టర్ సందీప్ రాజ్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై, అజయ్, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
Also Read : ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడిగా బాలీవుడ్ హీరో.. కన్నప్ప మూవీ నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్