ఈటీవీ ప్రభాకర్ కుమారుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandra Hass) హీరోగా ‘రామ్ నగర్ బన్నీ’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్‌లో చంద్రహాస్ చూపించిన యాటిట్యూడ్ ఆయనని వార్తలలో ఉంచేలా చేసింది. తనేదో పెద్ద సూపర్ స్టార్ అన్నట్లుగా ఇచ్చిన బిల్డప్.. బాగానే ఆయన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇంత చేసినా ‘రామ్ నగర్ బన్నీ’ నిరాశనే మిగల్చడంతో.. ఈ యాటిట్యూడ్ స్టార్ చూపించే యాటిట్యూడ్‌లో కాస్త ఛేంజ్ కనిపించింది. ఏదైనా ఒక రేంజ్ వరకే అనేది అర్థమైనట్టుంది. అందుకే ఇప్పుడు ప్యూర్ విలేజ్, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ‘రామ్ నగర్ బన్నీ’ తర్వాత చంద్రహాస్ నటించిన సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha Movie). ఈ సినిమా ఎప్పుడో దసరాకే విడుదల కావాల్సి ఉంది. కానీ ఏం జరిగిందో ఏమో.. వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడీ సినిమాలో కదలిక వచ్చింది. గురువారం ఈ సినిమా టీజర్‌ని మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఎలా ఉందంటే...
రుద్రారంలో జరిగే గొడవలతో ఈ టీజర్‌ని స్టార్ట్ చేశారు. ఆ గొడవలకు కారణం ఆ ఊరికి కాస్త పేరున్న మనిషి ముందు వేరొకడు మీసం తిప్పడమే అనేలా రివీల్ చేశారు. అయితే అదొక్కటి కాదు... ఆ ఊరిలో గొడవలు జరగడానికి పెద్దగా కారణం ఏం అవసరం లేదని చెప్పడం చూస్తుంటే.. దర్శకుడు డైరెక్ట్‌గా స్టోరీలోకి తీసుకెళుతున్నాడనేది తెలుస్తుంది. వెంటనే ఎలివేషన్స్‌తో హీరో, హీరోయిన్ల ఎంట్రీ సీన్లు. ముఖ్యంగా హీరోయిన్ ఎంట్రీ రజనీకాంత్ మ్యానరిజమ్‌తో ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. హీరోకి, హీరోయిన్ ఇచ్చే వార్నింగ్, మరోసారి హీరో ఎలివేషన్ సీన్లతో టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇచ్చేలా.. ‘నొప్పి నీ కళ్లల్లో తెలుస్తుందేంట్రా’ అని హీరో చెప్పే డైలాగ్.. ఆ తర్వాత వచ్చే సీన్లు అన్నీ కూడా ప్రేమకి రిలేటెడ్‌గా ఉండటంతో పాటు.. చివరిలో హీరో ఫ్రెండ్ గూస్‌బంప్స్ అంటూ విజువల్స్ గురించి చెప్పిన డైలాగ్.. సినిమాపై ఇంట్రస్ట్ కలిగించేలానే ఉన్నాయి కానీ.. ఈ సినిమాలో కొత్తదనం అయితే ఏమీ లేదని, చాలా రొటీన్ సినిమానే అనేలా ఈ టీజర్‌తోనే రివీలైపోతుండటం విశేషం. మరి ఈ కంటెంట్‌తో యాటిట్యూడ్ స్టార్ ఎలా నెట్టుకొస్తాడో చూడాలి.
Also Read: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
టీజర్ నిజంగా గూజ్‌బంప్స్ తెప్పించేలా అయితే లేదులే కానీ.. పరువుకు సంబంధించిన ఓ ప్రేమకథని అయితే ఈ సినిమాతో చెప్పపోతున్నారనేది తెలుస్తుంది. కొన్ని సీన్లు మాత్రం చాలా న్యాచురల్‌గా విలేజ్‌లో కొట్టుకున్నట్లే, మాట్లాడుకున్నట్లే చూపించారు. రెండు విలేజ్‌ల మధ్య జరిగే గొడవ, ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కిందనే విషయాన్ని ఈ టీజర్ తెలియజేస్తుంది. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్‌ని కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు. మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అర్జున్ మహి, మురళీధర్ గౌడ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో CC క్రియేషన్స్ పతాకంపై సంపత్. వి. రుద్ర దర్శకత్వంలో గెడా చందు, గాయత్రీ చిన్ని, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.