Bhagavanth Kesari Success Celebrations : గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ భోళా మనిషి. ఏదీ దాచుకోరు. మనసులో ఉన్న మాటను బయటకు చెప్పడం అలవాటు. అంతా ఓపెన్! విజయ దశమికి విడుదలైన 'భగవంత్ కేసరి' సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్ (Balakrishna Speech)లో ఆయన కొత్తగా కనిపించారు. కొన్ని రోజులుగా బాలకృష్ణ గడ్డంతో కనిపిస్తున్నారు. ఇప్పుడు తీసేశారు. అప్పుడు తనకు తాను కొత్తగా కనిపించానని ఆయన చెప్పుకొచ్చారు.
అద్దంలో చూసి గుర్తు పట్టలేదు!
''ఇవాళ నా ముఖం అద్దంలో చూసుకుని నన్ను నేను గుర్తు పట్టలేదు. నేను గడ్డం తీసి ఎన్ని రోజులు అయ్యిందో? (నవ్వులు). నా ముఖం గడ్డం లేకుండా చూసుకుని చాలా రోజులు అయ్యింది. ఒక్కసారి నేను బిత్తరపోయా... ఇది నా ముఖమేనా? అని! ఆ ఫీలింగ్ నుంచి బయట పడటానికి కాసేపు పట్టింది'' అని బాలకృష్ణ చెప్పారు.
శాశ్వతంగా నిలిచిపోయే చిత్రమిది!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు... భారతీయ చలన చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే సినిమా 'భగవంత్ కేసరి' అని బాలకృష్ణ చెప్పారు. ఇవాళ తెలుగు రాష్ట్రాలతో పాటు భారత దేశమంతా ఈ సినిమా గురించి డిస్కషన్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అనిల్ రావిపూడి తన అభిమాని అని, ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నానని... ఇప్పటికి కుదిరిందని, ఈ సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అనిల్ రావిపూడి ముందుకు వెళుతున్నారని, అతని సింప్లిసిటీ చూస్తే తనకు గర్వంగా ఉందన్నారు.
దేవి నవ రాత్రుల్లో సినిమా విడుదల కావడం సంతోషం
శక్తికి నిర్వచనం స్త్రీ అని బాలకృష్ణ చెప్పారు. రక్తం ధారపోసి మనిషికి జన్మ ఇచ్చేది, దారి తప్పితే మట్టి కరిపించేది మహిళ అని ఆయన గొప్పగా చెప్పారు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు 108 ప్రదక్షిణలు చేస్తామని, 'భగవంత్ కేసరి' తన 108వ సినిమా కావడం, అదీ నవ రాత్రుల్లో విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నాని బాలకృష్ణ తెలిపారు.
Also Read : డైనమిక్ కళ్యాణ్ రామ్ - 'డెవిల్'లో నందమూరి హీరో రాయల్ లుక్!
'భగవంత్ కేసరి' సినిమాలో శ్రీ లీల కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు జోడిగా తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటించారు. వాళ్ళిద్దరూ అద్భుతంగా యాక్ట్ చేశారని బాలకృష్ణ చెప్పారు. తమన్ నేపథ్య సంగీతం హ్యాట్సాఫ్ అని చెప్పారు.
Also Read : వెనక్కి తగ్గేది లేదు - ప్రభాస్‌తో పోటీలో ఒక్క రోజు ముందుకు షారుఖ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. ఇంతకు ముందు 'మజిలీ' ప్రొడ్యూస్ చేశారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేశారు. ఆయనకు తొలి తెలుగు చిత్రమిది. శరత్ కుమార్ ఓ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు ఆయనది సోదరుడి పాత్ర. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial