Producer SKN About Allu Arjun: ఏపీ ఎన్నికల సమయంలో జరిగిన సంఘటన వల్ల మెగా ఫ్యామిలీ వేరు, అల్లు అర్జున్ వేరు అనే పరిస్థితి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ రాలేదు. దీంతో ఈ ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని ఫ్యాన్స్ అనుకోవడం మొదలుపెట్టారు. కానీ ఆ కుటుంబాల్లోని ఎవరూ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ముందుకు రాలేదు. అందుకే అసలు పరిస్థితి ఏంటి అని ఇతర టాలీవుడ్ నిర్మాతలకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అలాగే నిర్మాత ఎస్‌కేఎన్‌కు కూడా ఎదురవ్వగా ఆయన క్లారిటీగా సమాధానమిచ్చారు.


అదే ప్రశ్న..


ఎస్‌కేఎన్ నిర్మాతగా ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో ఉన్నారు. కానీ ‘బేబి’ అనే మూవీ వల్ల ఆయనకు ఎనలేని పాపులారిటీ లభించడంతో పాటు ఆ సినిమా తనకు ఎన్నో లాభాలను కూడా తెచ్చిపెట్టింది. కలెక్షన్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘బేబి’.. తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విషయంలో కూడా తన సత్తాను చాటుకుంది. పలు కేటగిరిల్లో ఈ సినిమాకు అవార్డులు దక్కాయి. దర్శకుడిగా సాయి రాజేశ్‌కు, హీరోయిన్‌గా వైష్ణవి చైతన్యకు కూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సత్కారం జరిగింది. దీంతో నిర్మాత ఎస్‌కేఎన్.. ఒక స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా.. అందులో అల్లు అర్జున్‌కు సంబంధించి ప్రశ్న ఎదురయ్యింది.


ఆయన స్పష్టం చేశారు..


ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గా పిఠాపురం వెళ్లకుండా నంద్యాలకు వెళ్లి అక్కడ వైసీపీ అభ్యర్థికి తన మద్దతును ప్రకటించాడు అల్లు అర్జున్. దీంతో మెగా ఫ్యామిలీకి ఆయన దూరమయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇక అల్లు అరవింద్ తనకు బాగా క్లోజ్ అవ్వడంతో అసలు ఏం జరిగింది, దీనిపై తన స్పందన ఏంటి అని ఎస్‌కేఎన్‌ను ప్రశ్నించారు. ‘‘బన్నీకి అత్యంత సన్నిహితులు అయిన బన్నీ వాసు చాలాసార్లు ఈ విషయాన్ని క్లారిఫై చేశారు. దాన్ని నేను వేరేవిధంగా స్పష్టం చేయడానికి లేదు. ఒక మెగా అభిమానిగా నేను ఆ ఫ్యామిలీలో ఉన్న అందరు హీరోలను అభిమానిస్తాను. నాకు అందరూ ఇష్టం. చిరంజీవి అంటే కూడా చాలా ఇష్టం’’ అని చెప్పుకొచ్చారు ఎస్‌కేఎన్.


అదే నా కోరిక..


‘‘అల్లు అర్జున్‌తో నాకొక పర్సనల్ రిలేషన్, జర్నీ కూడా ఉంది. ఇలాంటి కాంట్రవర్సీలు ఒకరోజు మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ చివరికి అందరూ బాగుండాలి, అందరూ కలిసుంటారు, కలిసుండాలి అన్నదే ఒక అభిమానిగా నా నమ్మకం, కోరిక కూడా’’ అని తెలిపారు ఎస్‌కేఎన్. అల్లు కుటుంబానికి దగ్గరయిన పలువురు నిర్మాతలు కూడా ఈ విషయంపై పలుమార్లు స్పందించారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అని, అందులో అల్లు అర్జున్ కూడా భాగమే అని వారు పాజిటివ్‌గా వ్యాఖ్యలు చేశారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఇకపై మెగా ఫ్యాన్స్ అనలేము అంటూ ఫ్యాన్ వార్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.



Also Read: చిరు, చరణ్‌ల 'మెగా' మనసు - కేరళ బాధితులకు తండ్రీ కుమారుల విరాళం కోటి... బాసూ, నువ్వు గ్రేట్!