సినిమా ప్రపంచానికి కొత్త సాంకేతికను పరిచయం చేసిన ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ లో జేమ్స్ కామెరూన్ ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయి. 1997 లో వచ్చిన ‘టైటానిక్’ సినిమాతో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు కామెరూన్. ఆ సినిమా భాషలతో సంబంధం లేకుండా ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ చాలా మందికి తమ ఫేవరేట్ సినిమాల లిస్ట్ లో ‘టైటానిక్’ ఉంటుంది. ఆ మూవీ తర్వాత కామెరూన్ 2007 లో ‘అవతార్’ సినిమాతో మళ్లీ ఓ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. తర్వాత దాదాపు 13 ఏళ్ల తర్వాత ‘అవతార్ 2’ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు కామెరూన్. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16 న విడుదల అయిన ఈ చిత్రం అన్ని చోట్లా వసూళ్ల సునామీను సృష్టిస్తోంది. ఇండియాలో కూడా ‘అవతార్ 2’ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ఈ మూవీ హైదరాబాద్ లో ఓ అరుదైన రికార్డును సాధించింది. 


‘అవతార్ 2’ సినిమా హైదరాబాద్‌ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ AMB సినిమాస్‌ లో కూడా విడుదల అయింది. ఈ సినిమా రిలీజైన కొద్ది రోజుల్లోనే ఏఎంబీ కోటి రూపాయలు వసూళ్లు సాధించింది. కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఈ ఘనతను సాధించగా, ‘అవతార్ 2’ మాత్రం కేవలం 8 రోజుల్లోనే కోటి రూపాయల గ్రాస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇంకా ‘అవతార్ 2’ ఆ మల్టిఫ్లెక్స్‌లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.  తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా మరికొన్ని వారాల పాటు మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 1 బిలియన్ మార్క్‌ కు చేరువలో ఉంది. ‘అవతార్ 2’ సినిమాకు మొదటి వారంలోని భారీ స్పందన వచ్చింది. ఈ మూవీ ఇండియాలో కూడా మంచి రికార్డులు సాధిస్తోంది. మొదటి వారంలో ఇక్కడ అంతగా ఆడకపోవచ్చు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మొదటి వారంలోనే 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ప్రశంసలు అందుకుంది.


ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లోనే రికార్డు స్థాయిలో బిలియన్ డాలర్లను (8,200 కోట్లు) వసూలు చేసినట్టు సినిమా ట్రేడ్ అనలిస్ట్ అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ డాలర్లు(16000 కోట్లు) ఆదాయం వస్తేనే తాము అనుకున్న టార్గెట్ రీచ్ అవుతామని గతంలో జేమ్స్ కామెరూన్ ప్రకటించారు. మరో రెండు వారాల పాటు సినిమాకు ఇదే విధంగా రెస్పాన్స్ వస్తే మరో బిలియన్ డాలర్లు సులభంగానే వసూలు చేయొచ్చని అంటున్నారు సినీ నిపుణులు. ఇప్పటికే ఈ మూవీ 300 మిలియన్ డాలర్లు ఒక్క నార్త్ అమెరికాలో రాబట్టగా మిగిలిన 700 మిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా వసూలైంది. ఇండియాలో ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. 


Also Read : మాస్ సినిమా చేస్తే 'కెజియఫ్' లాంటి సినిమా చేస్తా - ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ