ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అవతార్ రికార్డు 12 ఏళ్లు గడిచినా ఇంకా చెక్కు చెదరలేదు. సీక్వెల్ అనౌన్స్ చేయగానే సోషల్ మీడియా ఊగిపోయింది. అవతార్‌పై ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి ఇవి చాలు. ఈ సినిమా టీజర్‌ను మార్వెల్ స్టూడియోస్ ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’ థియేటర్లలో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాకు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అనే పేరు కూడా పెట్టారు. ఈ టీజర్ ఎలా ఉందంటే?


టీజర్ ఉండేది కొద్ది సేపే కాబట్టి పండోరా విజువల్స్‌ను ఇందులో చూపిస్తారని అందరూ అంచనా వేశారు. దానికి తగ్గట్లే పండోరా గ్రహానికి సంబంధించిన స్టన్నింగ్ విజువల్స్‌తో టీజర్ ఓపెన్ అవుతుంది. మొదటి భాగంలో చూపించని పండోరా గ్రహాన్ని ఇందులో చూపిస్తున్నారని టీజర్ మొదలవగానే చెప్పేయవచ్చు.


పండోరాలోని అద్భుతమైన లొకేషన్లు, చూడగానే మైమరపించే నీలి రంగులోని సముద్రాన్ని (పండోరాలో వీటిని ఏమంటారో చెప్పలేదు మరి) తర్వాత చూపిస్తారు. అక్కడ నుంచి సినిమా పేరును జస్టిఫై చేస్తూ విజువల్స్ అండర్ వాటర్‌లోకి వెళ్తాయి.


హీరో శామ్ వర్తింగ్‌టన్ చేసిన జేక్ సల్లీ, హీరోయిన్ జో సల్దానా ‘నేతిరి’ పాత్రలకు సంబంధించిన కొత్త క్లోజప్ షాట్లను ఇందులో చూడవచ్చు. అయితే ఇందులో కొత్తగా కనిపించేవి జేక్ సల్లీ, నేతిరికి పుట్టిన పిల్లలే. వీరు సగం మనుషులు కాగా, సగం పండోరాకు చెందిన నావి జాతికి చెందిన వారు. హీరో, హీరోయిన్ దత్తత తీసుకున్న జాక్ చాంపియన్  అనే కొత్త పాత్ర ఇందులో ఉంది.


ఆ తర్వాత పండోరాలోని సముద్ర జీవులను చూడవచ్చు. ఇవి పెద్ద సైజులో ఉండటంతో పాటు అక్కడి వారితో స్నేహపూరితంగానే ఉన్నాయి. టైటానిక్ ఫేమ్ ‘కేట్ విన్‌స్లెట్’ను నావి గ్రహానికి చెందిన వ్యక్తిగా చూపించారు. ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది. ‘నాకు ఒక్క విషయం మాత్రం తెలుసు. మనం ఎక్కడికి వెళ్లినా... కుటుంబమే మనకు కోట.’ అని హీరో అంటాడు.


దీన్ని బట్టి ఇందులో గాడ్ ఫాదర్ తరహా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గతంలోనే నిర్మాతలు తెలిపారు. అయితే ఈ సినిమా గురించి ఇంకా తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇందులో కథేంటి అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.


అవతార్: ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. 2024లో అవతార్ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్ 5 కూడా విడుదల కానున్నాయి. ఈ టీజర్ త్వరలో యూట్యూబ్‌లో కూడా విడుదల కానుంది.