Article 370 Movie Banned in Gulf Countries: ఈమధ్య గల్ఫ్ దేశాల్లో ఇండియన్ సినిమాలకు చిక్కులు ఎదురవుతున్నాయి. ఒకవేళ ఆ సినిమా ఎక్కువగా భారత్‌కు సంబంధించిన విషయాలపై తెరకెక్కించి ఉంటే.. దానిని విడుదల చేయడానికి గల్ఫ్ దేశాలు ఒప్పుకోవడం లేదు. కొన్నిరోజుల క్రితం హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘ఫైటర్’ మూవీకి ఇదే సమస్య ఎదురవ్వగా.. ఇప్పుడు యామీ గౌతమ్ లీడ్ రోల్ చేసిన ‘ఆర్టికల్ 370’ని కూడా విడుదల చేయడానికి గల్ఫ్ దేశాలు ఒప్పుకోవడం లేదని సమాచారం. కాగా ఇండియాలో మాత్రం ఈ సినిమా విడుదలయ్యి పాజిటివ్ టాక్‌ను అందుకుంటోంది. నెటిజన్లు దీనికి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.
ఎక్కువగా హిందీ చిత్రాలకే సమస్యలు..
‘ఆర్టికల్ 370’ సినిమా తాజాగా విడుదలయ్యి ఇండియాలో మాత్రమే కాదు.. ఓవర్సీస్‌లో కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. విమర్శకులు సైతం ఈ మూవీకి ప్రశంసలు అందిస్తున్నారు. కానీ ఇది గల్ఫ్ దేశంలో బ్యాన్ అవ్వడం మాత్రం బాలీవుడ్‌కు మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ అక్కడ బ్యాన్ అవ్వగా ఈసారి మరో హిందీ చిత్రం కూడా విడుదల కాకుండా ఆగిపోవడం బాలీవుడ్ మేకర్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. గల్ఫ్ దేశాల్లో కూడా హిందీ చిత్రాలకు ఫ్యాన్స్ ఉంటారు. పైగా ‘ఫైటర్’, ‘ఆర్టికల్ 370’లాంటి మంచి విజువల్, థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలు అక్కడ బ్యాన్ అవ్వడం వల్ల ఈ చిత్రాలను చూడలేకపోతున్నందుకు అక్కడి ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతున్నారు.
గల్ఫ్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి ఎదురుదెబ్బ..
‘ఆర్టికల్ 370’ సినిమా అనేది టైటిల్‌కు తగినట్టుగానే పూర్తిగా ఆర్టికల్ 370పైనే తిరుగుతుంది. ఈ ఆర్టికల్‌పై, దీని చుట్టూ జరిగిన రాజకీయ మార్పులు, కాంట్రవర్సీలపై అవగాహన లేని ప్రేక్షకులకు ఈ సినిమా ఒక పాఠంగా మారుతుంది. మామూలుగా ఇండియన్ సినిమాలను గల్ఫ్ దేశాల్లో తెరకెక్కించడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తారు. కానీ అక్కడ తెరకెక్కించిన చిత్రాలను కూడా అక్కడే బ్యాన్ చేసుకుంటూ వెళ్తే గల్ఫ్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి ఎదురుదెబ్బ తగులుతుందని బాలీవుడ్ మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘ఆర్టికల్ 370’లాంటి సినిమా అయితే ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ చూస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.
ఆ సంఘటన ఆధారంగా..
‘ఆర్టికల్ 370’ సినిమాలో ఇంటలిజెన్స్ ఆఫీసర్ జూనీ హక్సర్ పాత్రలో యామీ గౌతమ్ నటించింది. 2019 ఆగస్ట్ 5న జమ్మూ కశ్మీర్‌కు ఉన్న స్పెషల్ స్టేటస్‌ను తొలగించి, వాటిని కూడా టెర్రిటెరీలలో కలిపేసింది భారత ప్రభుత్వం. ఈ సినిమా మొత్తం ఆ సంఘటనపైనే ఆధారపడి తెరకెక్కించారు దర్శకుడు సుహాస్ జంభలే. మూవీని యామీ గౌతమ్ భర్త, బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ నిర్మించాడు. ప్రియమణి కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఇక ‘రామాయణ్’ ఫేమ్ అరుణ్ గోవిల్.. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కనిపించారు. మోదీగా అరుణ్ గోవిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే.. అది చూసి ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు.
Also Read: వామ్మో, బంగారం కేకును కట్ చేసిన ‘వాల్తేరు వీరయ్య’ బ్యూటీ - దాని విలువ అన్ని కోట్లా?