లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)కు ప్రజల్లో మంచి పేరు ఉంది. వెండితెరపై ఎన్నో పాత్రలకు తనదైన అద్భుతమైన నటనతో ప్రాణం పోశారాయన. విద్యానికేతన్ సంస్థల ద్వారా ఎంతో మందిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు మాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే... ఏపీలో ఎన్నికల నేపథ్యంలో తన పేరును కొందరు వాడుకోవడంతో సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు ఓ లేఖ విడుదల చేశారు.


స్వప్రయోజనాలకు నా పేరు వాడుకోవద్దు
''ఈ మధ్య కాలంలో నా పేరును రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీకి చెందిన వారైనా వారి వారి స్వప్రయోజనాల కోసం నా పేరును వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని మోహన్ బాబు పేర్కొన్నారు. 


చేతనైతే నలుగురికి సాయపడదాం!
మనం అనేక రకాల భావావేశాలు ఉన్న వ్యక్తుల ప్రపాప్మచంలో జీవిస్తున్నామని, ఎవరి అభిప్రాయాలు వారివి అని, అది వారి వ్యక్తిగతమని మోహన్ బాబు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''చేతనైతే నలుగురికి సాయపడడంలో దృష్టి పెట్టాలి గానీ సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకు రావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభివందనాలు తెలియజేస్తూ... శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉండమని కోరుకుంటూ.... ఉల్లఘించిన వారిపై న్యాయచర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను'' అని పేర్కొన్నారు.


Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు






ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు మంచుకు బంధుత్వం ఉంది. విష్ణు భార్య విరోనికా తండ్రి వైఎస్ సుధాకర్ రెడ్డి, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరులు. విష్ణుకు జగన్ బావ వరుస అన్నమాట. మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ భార్య భూమా అఖిల ప్రియది రాయలసీమలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె అక్క, సోదరుడు రాజకీయాల్లో ఉన్నారు.  భూమా నాగిరెడ్డి, శోభా రాణి దంపతుల రాజకీయ ప్రస్థానం గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరోవైపు తెలుగు దేశం పార్టీలోని కొందరు వ్యక్తులతోనూ మోహన్ బాబు కుటుంబ సభ్యులకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ పెద్దలను అప్పుడప్పుడూ మోహన్ బాబు ఫ్యామిలీ కలుస్తూ ఉంటారు.


ప్రతి పార్టీలోనూ మోహన్ బాబు ఫ్యామిలీకి సన్నిహితులు ఉన్నారని చెప్పవచ్చు. ఆ ఒక్కటి మాత్రమే కాదు... ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపించగల వ్యక్తి. అయితే... కొన్నాళ్లుగా రాజకీయాలకు మోహన్ బాబు దూరంగా ఉంటున్నారు. ఏ ఒక్క పార్టీకో ఆయన మద్దతు ఇవ్వడం లేదు. అందువల్ల, ఆయన పేరు వాడుకోవద్దని విజ్ఞప్తి చేసినట్లు ఉన్నారు.


Also Readప్రభాస్ సినిమా నుంచి తీసేశారు, పవన్‌ కళ్యాణ్ తో నటించలేదు... రకుల్ టాలీవుడ్ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!