రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'పెళ్లి చూపులు', 'డియర్ కామ్రేడ్' చిత్రాలకు యష్ రంగినేని (Yash Rangineni) నిర్మాణ భాగస్వామి. 'మధుర' శ్రీధర్ రెడ్డితో కలిసి 'దొరసాని', 'ఏబీసీడీ' చిత్రాలు నిర్మించారు. ఆయన బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై నిర్మించిన సినిమా 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' (Annapurna Photo Studio Movie). ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావ్, లావణ్య జంటగా నటించారు. మిహిర, ఉత్తర, 'వైవా' రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర పాత్రలు పోషించారు. ఈ నెల 21న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా యష్ రంగినేని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లో... 


లండన్‌లో ఎన్టీఆర్ సినిమాలు చూస్తుంటా 
''నాకు పాత తెలుగు చిత్రాలు అంటే ఇష్టం. నేను లండన్ వెళ్లినప్పుడు ఎన్టీఆర్ పాత చిత్రాలు చూస్తుంటా. సినిమాలో ఎంట్ర్‌టైన్‌మెంట్ అంటే ఇలా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. దర్శకుడు చెందు ముద్దు చెప్పిన కథలో కోనసీమ పల్లెటూరి నేపథ్యం, పీరియాడిక్ టచ్ ఆకట్టుకున్నాయి. ట్విస్టులు, టర్నులు నచ్చాయి. కథ బాగా నచ్చింది. నాకు వర్ధన్ దేవరకొండ గారి ద్వారా చెందు పరిచయం అయ్యాడు అసలు, ఈ కథ వినమని ఆయనే చెప్పారు. మూడేళ్ళ క్రితం ఇదంతా జరిగింది. చందు ఇంతకు ముందు తీసిన 'ఓ పిట్ట కథ' కంటే ఇందులో ఎక్కువ టర్న్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయన స్క్రీన్ ప్లే బాగా తీశారు. మేం ఆగస్టు, 2022లో సినిమా షూటింగ్ ప్రారంభించాం'' 


ఆలస్యమైన హీరో ఏడడుగులు...
ప్రేమలో అనూహ్య మలుపులు!
''అన్నపూర్ణ ఫోటో స్టూడియో'లో కథ పల్లెటూరిలో జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల కథానాయకుడు పెళ్లి చేసుకోవడం ఆలస్యం అవుతుంది. ఇంతలో ఓ అనూహ్య ఘటన జరుగుతుంది. దాని వల్ల ప్రేమకథ ఎటువంటి మలుపులు తిరిగింది? అనేది ఉత్కంఠభరితమైన అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది. వాణిజ్య హంగులతో సినిమా తీసినా... సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకోలేదు. నిజాయతీగా సినిమా చేశాం'' 
నేనూ ఓ పాత్రలో నటించాను!''ఈ సినిమాలో మొత్తం ఏడెనిమిది ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు కథతో సంబంధం ఉంటుంది. ఏదో ఒక పర్పస్ ఉంటుంది. కథ ముగియడానికి వాళ్ళకు కనెక్ట్ ఉంటుంది. ఈ సినిమాలోని నేనూ ఓ పాత్రలో నటించా. ఆ పాత్రకు పేరున్న నటుడు అయితే అంచనాలు ఏర్పడతాయని, నన్నే నటించమని దర్శకుడు అడిగారు. పల్లెటూరు ప్రకృతి అందాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్థాయి. సంగీతం ఆకట్టుకుంటుంది''


Also Read : ఆలీకి పవన్ కళ్యాణ్ ఝలక్ - స్నేహానికి పూర్తిగా తెగతెంపులు?


ప్రీమియర్ షోలకు మంచి స్పందన వచ్చింది
''తిరుపతి, విజయవాడ... మేం చాలా చోట్ల ప్రివ్యూ షోలు వేశాం. కథంతా 80ల నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి... యువతకు సినిమా నచ్చుతుందో? లేదో? అనుకున్నాం. సినిమా చూసిన యువత నుంచి మంచి స్పందన వచ్చింది. స్ట్రెస్ రిలీఫ్ ఫిల్మ్ అన్నారు. అది మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది''


'పెళ్లి చూపులు' ఎలా చేశామో?
''చెందు లాంటి దర్శకుడు దొరకడం మా అదృష్టం. వృథా ఖర్చు ఎలా తగ్గించాలి? బడ్జెట్ ఎంత? వంటి విషయాల్లో పూర్తి స్పష్టతతో చేశాడు. మేం 'పెళ్లి చూపులు'ను ఎంత ప్రణాళికతో చేయాలనుకున్నామో... ఈ సినిమానూ అలాగే పక్కాగా ప్రొడక్షన్ ప్లానింగ్‌తో చేశాం''. 


హీరో హీరోయిన్లు చక్కగా చేశారు!
''చైతన్య రావ్ మంచి నటుడు. చూడడానికి బావుంటాడు. బాగా నటించాడు. గోదావరి యాసలో అద్భుతంగా డైలాగులు చెప్పాడు. లావణ్య కూడా చక్కగా నటించింది. ఈ సినిమాను ఈటీవీ విన్ యాప్ ఓటీటీ వాళ్లకు ఇచ్చాం. సినిమా చూసి బావుందని, వాళ్ళే ముందుకు వచ్చారు. ఇటీవల కొన్ని సినిమాలకు మాత్రమే విడుదలకు ముందు ఓటీటీ రైట్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. సినిమా బాగుంటేనే ఎవరైనా కొంటున్నారు'' 


Also Read : తమన్ ఆ పాటను కాపీ కొట్టారా? 'జాణవులే'పై ఫ్యాన్స్ ట్రోల్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial