Amitabh Bachchan Iconic Movies: ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌. దిగ్గజ నటుల సినిమాలను అభిమానులకు అందిస్తూ అలరిస్తోంది. గత సంవత్సరం దేశవ్యాప్తంగా లెజెండరీ యాక్టర్స్ సినిమాలను ప్రదర్శించింది ఈ సంస్థ. ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివేంద్ర సింగ్ డూంగర్ పుర్ నేతృత్వంలో ఈ ప్రదర్శనలు కొనసాగాయి. ‘బచ్చన్‌ బ్యాక్‌ టు ది బిగినింగ్‌’, ‘దిలీప్‌ కుమార్‌- హీరో ఆఫ్‌ హీరోస్‌’, ‘దేవానంద్‌జీ100- ఫరెవర్‌ యంగ్‌’ పేర్లతో దిగ్గజ నటులైన అమితాబ్‌ బచ్చన్‌, దిలీప్‌ కుమార్‌, దేవానంద్‌  యాక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలను ప్రదర్శించారు.


ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బిగ్ బి క్లాసిక్ చిత్రాల ప్రదర్శన


ఇక ఈ సారి అమితాబ్ బచ్చన్ మర్చిపోలేని బహుమానం ఇవ్వబోతోంది ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌. మొట్టమొదటి సారిగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలను ప్రదర్శించేందుకు రెడీ అయ్యింది. ‘అమితాబ్‌ బచ్చన్‌, బిగ్‌ బి ఫరెవర్‌’ పేరుతో ఆయన ఐకానిక్ చిత్రాలను ప్రదన్శించనున్నారు. ఈ నెల 24 నుంచి డిసెంబరు 3 వరకు ఫ్రాన్స్‌ లో జరిగే ప్రతిష్ఠాత్మమైన ‘ఫెస్టివల్‌ డెస్‌ 3 కాంటినెంట్స్‌’ 45వ ఎడిషన్‌ సందర్భంగా అమితాబ్‌ ఆల్ టైమ్ హిట్ సినిమాలు ‘అభిమాన్‌’, ‘షోలే’, ‘దీవార్‌’, ‘కభీ కభీ’, ‘అమర్‌ అక్బర్‌ అంథోనీ’, ‘త్రిషూల్‌’, ‘డాన్‌’, ‘కాలా పత్తర్‌’ ప్రేక్షకుల ముందు ప్రదర్శించనున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో అమితాబ్ తరఫున ఆయన కుమార్తె శ్వేత బచ్చన్‌ పాల్గొననున్నారు.


సంతోషం వ్యక్తం చేసిన అమితాబ్ బచ్చన్    


ఇక తన సినిమాలను మరోసారి ప్రదర్శించడం పట్ల అమితాబ్ సంతోషం వ్యక్తం చేశారు. “క్లాసిక్‌ సినిమాలను మళ్లీ ప్రదర్శించాలని ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. నేను నటించిన తొమ్మిది సినిమాలను ఫిల్మ్ ఫెస్టివ్ లో స్క్రీనింగ్ చేయడం మరింత సంతోషం కలిగిస్తున్నది. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో  హ్రిషికేష్‌ ముఖర్జీ, మన్‌మోహన్‌ దేశాయ్‌, యశ్‌ చోప్రా, రమేష్‌ సిప్పి లాంటి దిగ్గజ దర్శకులతో కలిసి పని చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని చెప్పారు.  


గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పిన బిగ్ బి కూతురు


ఇక తన తండ్రి సినిమాలను ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడం పట్ల గర్వంగా ఉందని బిగ్ బి కూతురు శ్వేత అమితాబ్ తెలిపారు.  “ప్రపంచ ప్రసిద్ధ ఫిల్మ్ ఫెస్టివల్ లో మా నాన్న నటించిన సూపర్ హిట్ సినిమాలను ప్రదర్శించడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. గతేడాది మా నాన్న 80వ బర్త్ డే సందర్భంగా ‘బచ్చన్‌ బ్యాక్‌ టు ది బిగినింగ్‌’ పేరుతో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. మా నాన్న లోని గొప్ప నటుడిని ప్రేక్షకులు మరోసారి చూసే అవకాశం దక్కడం నిజంగా మర్చిపోలేని విషయం” అని వెల్లడించారు. ఇక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో అమితాబ్ చిత్రాల ప్రదర్శనకు అవకాశం కల్పించిన ఆర్టిస్టిక్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది ఫెస్టివల్‌ జెరోమ్‌ బారన్‌కి ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ శివేంద్ర సింగ్ ధన్యవాదాలు తెలిపారు.    


Read Also: మీరు చెప్పినట్టే చేస్తా, ఆ గ్యారెంటీ ఇస్తారా? సినీ జర్నలిస్టులకు దిల్ రాజు సవాల్