Dil Raju: సినిమా రంగం అనేది ఓ రంగుల ప్రపంచం. ఏ సినిమా హిట్ అవుతుంది? ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో? చెప్పడం కష్టం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేకర్స్ ప్రాణం పెట్టి తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలున్నాయి. తక్కువ ఖర్చుతో చిన్న నటీనటులతో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఘటనలూ ఉన్నాయి. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా, చాలా మంది దర్శక నిర్మాతలు సినీ క్రిటిక్స్ ఇచ్చే రివ్యూలు, రేటింగ్స్ మీద ఎప్పుడో ఒకప్పుడు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి సినిమా రివ్యూల గురించి చర్చకు ‘కోట బొమ్మాళి పీఎస్’ మూవీ ప్రమోషన్ వేదికగా మారింది. సినిమా రివ్యూలు ఇచ్చే జర్నలిస్టులను స్టేజి మీద కూర్చోబెట్టి, నిర్మాతలు కింద కూర్చొని ప్రశ్నలు సంధించారు.


నిర్మాతల ప్రశ్నలకు సినీ జర్నలిస్టుల సమాధానాలు  


సినిమా విడుదల కాగానే మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు పలు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు రివ్యూలు రాస్తుంటాయి. రేటింగ్ ఇస్తుంటాయి. అయితే, ఒక్కోసారి ఈ రివ్యూలు సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించిన సందర్భాలున్నాయి. నెగెటివ్ రివ్యూలు సినిమాలకు ఎదురు దెబ్బగా మారుతున్నాయి. ఒక్కోసారి సినిమా వసూళ్ల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఆయా సందర్భాల్లో మేకర్స్ సినిమా రివ్యూలు ఇచ్చే క్రిటిక్స్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.  తాజాగా పలువురు సినీ జర్నలిస్టులు స్టేజిపై కూర్చోగా, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, బన్నీ వాసు సహా పలువురు స్టేజి ముందు కూర్చొని ప్రశ్నలు అడిగారు. చర్చలో భాగంగా సినిమా రివ్యూలు, రేటింగ్స్ గురించి లోతుగా డిస్కర్షన్ జరిగింది. సినిమా విడుదలకు ముందే ఇచ్చే రివ్యూలు, రేటింగుల కారణంగా కొన్ని చిత్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని నిర్మాతలు అభిప్రాయపడ్డారు. ఫ్లాప్ అయిన సినిమాల గురించే కాదు, హిట్ అయిన సినిమాల గురించి కూడా నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారని విమర్శించారు. రివ్యూల కారణంగా చాలా మంది నిర్మాతలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


సినీ జర్నలిస్టులకు దిల్ రాజు సవాల్


ఈ చర్చలో భాగంగా నిర్మాత దిల్ రాజు వేసిన సవాల్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. “ఒక సినిమా స్క్రిప్ట్ ముందే మీకిస్తాను. మీకు నచ్చిన మార్పులు చేయండి. 10 మంది జర్నలిస్టులలో మెజారిటీ జర్నలిస్టులు 4 రేటింగ్ ఇచ్చిన తర్వాతే షూటింగ్ చేయిస్తాను. అప్పుడు సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ ఇవ్వగలరా? నేను డబ్బులు పెడతాను” అంటూ సినీ జర్నలిస్టులకు సవాల్ విసిరారు. ఈ సవాల్ కు కొందరు జర్నలిస్టులు సరే అనగా, మరికొందరు సాధ్యం కాదని చెప్పారు. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చు అని చెప్పారు. ఇక రివ్యూల విషయంలో కాస్త సమయమనం పాటించాలని నిర్మాతలు కోరారు. కానీ, టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో సినిమా రివ్యూలను ఆపడం కష్టమని జర్నలిస్టులు వెల్లడించారు.


Read Also: నాగ చైతన్యతో తమన్నా ప్రాంక్, చివర్లో ఊహించని ట్విస్ట్