Ram Gopal Varma - Amitabh Bachchan: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం', 'శపథం' సినిమాలతో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రాలకు ఏదొక అడ్డంకి ఎదురవుతూనే వుంది. ఎట్టకేలకు 'వ్యూహం' సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయిందని తెలుపుతూ, సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకుని మరీ వర్మ తన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కలిసి దిగిన ఫోటోలను 'X' లో పంచుకున్నారు
'ఆర్జీవీ డెన్ లో సర్కార్ అమితాబ్ బచ్చన్', 'శివయింగ్ విత్ బచ్చన్' అంటూ రాంగోపాల్ వర్మ రెండు ఫొటోలను షేర్ చేశారు. వారితో పాటుగా 'వ్యూహం' నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా ఉన్నారు అలానే ఆఫీస్ లో తన సీట్ లో బిగ్ బీ కూర్చోని ఉన్న పిక్ నీ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.
గతంలో రామ్ గోపాల్ వర్మ - అమితాబ్ బచ్చన్ కాంబోలో 'సర్కార్', 'సర్కార్ రాజ్', 'సర్కార్ 3', 'నిశబ్ద్', 'ఆగ్', 'డిపార్ట్మెంట్' వంటి అర డజను హిందీ సినిమాలు వచ్చాయి. వాటిల్లో కొన్ని హిట్ అవ్వగా.. మరికొన్ని డిజాస్టర్లుగా మారాయి. అయితే ఇప్పుడు బిగ్ బీ సడన్ గా ఆర్జీవీ డెన్ లో ప్రత్యక్షం అవ్వడంతో.. మరోసారి ఈ కలయికలో 'సర్కార్ 4' సినిమా వస్తుందేమో అనే చర్చలు మొదలయ్యాయి.
అమితాబ్ హైదరాబాద్ లోని ఆర్జీవీ డెన్ కు ఎందుకు వచ్చారో తెలియదు కానీ, వారితో ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కూడా ఉండటంతో 'వ్యూహం' సినిమా చూసి ఉంటారనే టాక్ వినిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా.. ఆర్జీవీ కల్పిత కథనంతో ఫిక్షనల్ రియాలిటీ జోనర్ లో ఈ సినిమాలను తెరకెక్కించారు.
నిజానికి 'వ్యూహం' సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రిలీజ్ కు బ్రేక్ పడింది. సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చినప్పటికీ, తమను కించపరిచేలా సినిమా తీశారని ఆరోపిస్తూ తెలుగు దేశం పార్టీ యువ నేత నారా లోకేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. అయితే ఆర్జీవీ డివిజన్ బెంచ్‌కు వెళ్లి రిలీజ్ కు క్లియరెన్స్ తెచ్చుకున్నారు. ఫిబ్రవరి 23న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ ఈసారి కూడా విడుదలకి అడ్డంకులు ఎదురయ్యాయి.
ఈ నేపధ్యంలో పట్టువదలని విక్రమార్కుడిలా ముంబైకి వెళ్లి మరీ సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు రామ్ గోపాల్ వర్మ. 'వ్యూహం' చిత్రాన్ని శుక్రవారం కాకుండా శనివారం మార్చి 2న విడుదల చేయటానికి రెడీ అయ్యారు. అయితే రెండో భాగం 'శపథం' సినిమా రిలీజ్ పై ఇంకా క్లారిటీ రావటం లేదు. ముందుగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు కానీ.. ఇంకా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాలేదని తెలుస్తుంది. ఏపీలోఎన్నికల కోడ్ వచ్చే లోపు ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చెయ్యాలని ఆర్జీవీ పట్టుదలగా ఉన్నారు. మరి అప్పటికి ముంబై అధికారులు సినిమా చూసి సెన్సార్ క్లియరెన్స్ ఇస్తారో లేదో వేచి చూడాలి.
Also Read: సల్మాన్ ఖాన్ - అమీర్ ఖాన్ మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా?