Aamir Khan - Salman Khan Fight: 1994లో బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ కాంబినేషన్ లో వచ్చిన కామెడీ మూవీ 'అందాజ్ అప్నా అప్నా'. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఇదే చిత్రాన్ని తెలుగులోకి 'వీడెవడండి బాబు' పేరుతో రీమేక్ చేస్తే ఫ్లాప్ అయింది.. అది వేరే విషయం అనుకోండి. ఆ సినిమా హిందీ మాతృక సమయంలోనే అమీర్, సల్మాన్ మధ్య సంబంధాలు దెబ్బ తిన్నట్లుగా చెప్పుకుంటారు. అదే విషయాన్ని సీనియర్ నటుడు షెహజాద్ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
'అందాజ్ అప్నా అప్నా' సినిమాలో కీలక పాత్ర పోషించిన షెహజాద్ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సల్మాన్, అమీర్ ల మధ్య సంబంధాల గురించి, ఇద్దరూ సెట్స్ లో తరచుగా ఎందుకు గొడవపడ్డారనే సంగతులను పంచుకున్నారు. "వాళ్లిద్దరూ నా కళ్ళ ముందే చాలాసార్లు గొడవ పడ్డారు. ఇక్కడ నేను ఎవరిదీ తప్పని చెప్పను. నేను చిన్నప్పటి నుండి సల్మాన్‌తో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. అందుకే వారి మధ్య వారధిగా ఉండి, గొడవ ఆపడానికి ప్రయత్నించేవాడిని" అని తెలిపారు.
అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇద్దరూ వేర్వేరు పని విధానాన్ని కలిగి ఉండేవారని షెహజాద్ చెప్పారు. అమీర్ టైంకి సెట్స్ లో అడుగుపెట్టేవారని, కానీ సల్మాన్ మాత్రం చాలా ఆలస్యంగా షూటింగ్ కు వచ్చేవారని, దాంతో ఆయన కోసం ఆమీర్ చాలా సమయం వెయిట్ చెయ్యాల్సి వచ్చేదని తెలిపారు. ఉదయం 9 గంటలకు షూటింగ్ అంటే అమీర్ 7-7.30 గంటలకే వచ్చేవారని.. సల్మాన్ వచ్చేసరికి 10-11 అయ్యేదని చెప్పారు. బాంద్రా నుండి రావడం ఎంతో కష్టమని, కొన్నిసార్లు కారు చెడిపోయి మరికొన్ని సార్లు మరేదైనా ఇతర కారణాలతో ఆలస్యంగా వచ్చేవాడని అన్నాడు.
ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ఇద్దరి పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుండేదని షేహ్జాద్ ఖాన్ అన్నారు. ఎలాంటి సీన్ అయినా సింగిల్ టేక్ లో చేసేసేవారని చెప్పారు. షూట్ సమయంలో తామంతా చాలా సరదాగా గడిపామని.. నిర్మాత తన ఇంట్లో వండిన ఆహారాన్ని తెచ్చేవాడని, సెట్స్ లో ఫ్యామిలీ వాతావరణం ఉండేదని హిందీ నటుడు తెలిపారు.
నిజానికి ఒకప్పుడు ఖాన్స్ మధ్య పచ్చగడ్డేస్తే కూడా భగ్గుమంటుందన్న రేంజ్‌లో గ్యాప్ ఉండేదని బాలీవుడ్ మీడియా పేర్కొంటూ వచ్చేది. యంగ్ ఏజ్‌లో కలిసి నటించిన సల్మాన్, ఆమీర్ ఇద్దరూ.. తర్వాతి రోజుల్లో చాలా డిస్టన్స్ మెయిన్‌టైన్ చేశారు. వారు ఒకే స్టేజ్ పంచుకోడానికి ఇష్టపడేవారు కాదని, ఒకరికొకరు ఎదురు పడేవారు కాదని అప్పట్లో కథనాలు ఉన్నాయి.
2013లో కాఫీ విత్ కరణ్ షోలో అమీర్ మాట్లాడుతూ.. “అందాజ్ అప్నా అప్నాలో, సల్మాన్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నాకు ఆయనంటే ఇష్టం లేదు. అతను చాలా మొరటుగా, అనాలోచితంగా ప్రవర్తించాడు. అతనితో పనిచేసిన అనుభవాన్ని గుర్తుంచుకొని, ఆ తర్వాత నేను అతనికి దూరంగా ఉండాలనుకున్నాను" అని చెప్పారు. అయితే క్రమం క్రమంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఖాన్స్ మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అన్నీ మర్చిపోయి తరచుగా కలుసుకోవడం, ఒకటి ఇంటికి మరొకరు వెళ్లి పార్టీలు చేసుకోవడం, సినిమా ప్రమోషన్స్ లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం వంటివి జరిగాయి. ఇప్పటికీ అలాంటి స్నేహ బంధమే వారి మధ్య కొనసాగుతోంది.
Also Read: కమెడియన్.. హీరో.. విలన్.. ఏదైనా నీకే సాధ్యమెహే - బర్త్‌డే బాయ్ సునీల్ గురించి ఈ విషయాలు తెలుసా?