Happy Birthday Sunil: సునీల్.. టాలీవుడ్‌లో కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి, కొన్నేళ్ల పాటు తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన నటుడు. ఆ తర్వాత కథానాయకుడిగానూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మెప్పించారు. అన్ని రోల్స్ కలిపి ఇప్పటి వరకూ దాదాపు 200కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా రాణిస్తున్న సునీల్ బర్త్ డే నేడు. ఈరోజుతో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఈ భీమవరం బుల్లోడి సినీ ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
సునీల్ అసలు పేరు ఇందుకూరి సునీల్ వర్మ. 1974 ఫిబ్రవరి 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలో జన్మించారు. తన బాల్యమంతా అక్కడే గడిపిన ఆయన తన ఐదవ ఏటనే తండ్రిని కోల్పోయారు. డాన్స్ మీద ఉన్న ఆసక్తి, మెగాస్టార్ చిరంజీవి అంటే ఉన్న అభిమానం ఆయన్ని సినిమా రంగం వైపు అడుగులు వేసేలా చేసాయి. బి.ఏ పూర్తయ్యాక హైదరాబాద్ కు వచ్చి డాన్సర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా, విలన్ గా అవకాశాల కోసం ప్రయత్నించారు. చివరకు తన స్నేహితుడు, రూమ్మేట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందించిన 'నువ్వే కావాలి' (2000) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు.
కమెడియన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సునీల్.. 2006 లో 'అందాల రాముడు' సినిమాలో హీరో అవతారమెత్తాడు. ఫస్ట్ మూవీ హిట్టవడంతో వరుసగా లీడ్ రోల్స్ పోషించే అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన 'మర్యాద రామన్న' చిత్రం అతని కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకూ హీరో కమ్ కమెడియన్ గా సినిమాలు చేస్తూ వచ్చిన సునీల్.. ఫుల్ టైం హీరోగా మారిపోయారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా కనిపించే ఆయన.. ఒక్కసారిగా కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీలోకి మారి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ విధంగానే 'పూల రంగడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. 'తడాకా' లాంటి మల్టీస్టారర్ తో ఆకట్టుకున్నారు.
అయితే హీరోగా సునీల్ ప్రయాణం ఆశించిన విధంగా ముందుకు సాగలేదు. స్క్రిప్ట్ సెలక్షన్ లో చేసిన పొరపాట్ల వల్ల బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ చవిచూశారు. 'కృష్ణాష్టమి', 'ఈడు గోల్డ్ హే', 'జక్కన్న', 'ఉంగరాల రాంబాబు', '2 కంట్రీస్', 'సిల్లీ ఫెలో'.. ఇలా వరుస పరాజయాలు పలకరించడంతో హీరోగా కెరీర్ డౌన్ ఫాల్ అవడం స్టార్ట్ అయింది. అలాంటి టైంలో కాస్త గ్యాప్ తీసుకుని, 'అరవింద సమేత వీర రాఘవ' మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. అవకాశం వచ్చినప్పుడు విలన్ రోల్స్ లోనూ అలరిస్తున్నారు.
'డిస్కో రాజా' సినిమాతో విలన్ గా మారిన సునీల్.. 'కలర్ ఫోటో' చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. 'పుష్ప: ది రైజ్' సినిమాలో చేసిన మంగళం శ్రీను క్యారక్టర్ ఆయనకు పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇది ఆయన్ను తమిళ్ లోనూ బిజీ ఆర్టిస్టుగా మార్చేసింది. 'మార్క్ ఆంటోనీ' 'జైలర్' 'మహావీరుడు' లాంటి చిత్రాలు కోలీవుడ్ ఆడియన్స్ కు దగ్గర చేసాయి. ప్రస్తుతం 'పుష్ప: ది రూల్', 'గేమ్ ఛేంజర్' వంటి పాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న సునీల్.. రానున్న రోజుల్లో మరిన్ని వైవిద్యమైన పాత్రలు చేయాలని కోరుకుంటూ, ''ABP దేశం'' ఆయనకు పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
Also Read: చిన్న సినిమాలు, పెద్ద విజయాలు - గత వారం డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలివే!