తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ హీరో - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే వేదికపై సందడి చేశారు.‌ 'పుష్ప 2 ది రూల్'లో నటనకు గాను ఉత్తమ కథానాయకుడిగా బన్నీని అవార్డు వరించిన సంగతి తెలిసిందే. 

సంధ్య థియేటర్ ఘటన తర్వాత...రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ కలవడం ఇదే!'పుష్ప 2 ది రూల్' ప్రీమియర్ షోను అభిమానులతో కలసి చూసేందుకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వెళ్లడం, ఆయన వచ్చిన సమయంలో అభిమానులు ఎగబడిన కారణంగా తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందడం, ఆ కేసులో అల్లు అర్జున్ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి రావడం అందరికీ తెలిసిన విషయాలే. 

'పుష్ప 2' ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు బన్నీని అరెస్ట్ చేయించారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. తెలంగాణ అసెంబ్లీలో సైతం అరెస్టు గురించి చర్చ జరిగింది. చట్టం ముందు అందరూ సమానమేనని రేవంత్ రెడ్డి తన చర్యల్లో చూపించారు. అయితే... అల్లు అర్జున్ మీద తనకు ఏ విధమైన ద్వేషం లేదని స్పష్టం చేశారు. ఆ ఘటన తర్వాత‌ సీఎం రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ కలవడం ఇదే మొదటిసారి.‌  

రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. దాని కంటే  ముందు, వేదిక మీదకు రావడానికి ముందు ఇద్దరు కింద కలిశారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముందుగా వచ్చారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ పక్కన కూర్చున్నారు. రేవంత్ రెడ్డి రాగానే అల్లు అర్జున్ లేచి ఆయనకు నమస్కారం చేశారు. ఆ వెంటనే బన్నీని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు రేవంత్. తర్వాత వేదికపై మరొకసారి ఇద్దరు కలిసి సందడి చేశారు. దాంతో తమ మధ్య ఎటువంటి మనస్పర్ధలు గాని, దూరం గాని లేవని పరోక్షంగా చెప్పినట్లు అయింది.

Also Read'రానా నాయుడు 2' రివ్యూ: డోస్ తగ్గించిన వెంకీ, రానా... నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ డ్రామా సిరీస్ సీజన్ 2 వచ్చేసింది... ఇది ఎలా ఉందంటే?

రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని మరీ...ఉత్తమ కథానాయకుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్...‌‌ తనకు ఈ పురస్కారం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సినిమా వేడుక కనుక ఒక డైలాగ్ చెబుతానంటూ వేదికపై ఉన్న రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని 'పుష్ప 2' సినిమాలో 'ఆ బిడ్డ మీద చెయ్యి పడితే రప్పా రప్పా నరుకుతా' అని అభిమానులు విజిల్స్ వేసేలా తనదైన శైలిలో డైలాగ్ చెప్పారు. తనకు లభించిన అవార్డును ఏఏ ఆర్మీ(అల్లు అర్జున్ అభిమానులకు)కి అంకితం చేశారు.

Also Read: అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్: ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేశా కానీ సేఫ్... లక్ష్మీ మంచు స్పందన