Manchu Vishnu's Kannappa Trailer Released: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్, టీజర్స్ ఆకట్టుకోగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ నెల 13నే ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా.. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనతో వాయిదా పడింది.


ట్రైలర్ ఎలా ఉందంటే?


'కన్నప్ప'లో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తిన్నడిగా కనిపించనున్నారు. 'దేవుడు లేడు.. దేవుడు లేడు.. అది ఒట్టి రాయి' అంటూ తిన్నడు చిన్నప్పుడు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. గూడెంలో ఉండే మహిమ గల 'వాయులింగం' కోసం అడవిలో కొన్ని వర్గాలు పోటీ పడుతుంటాయి. ఈ వాయులింగాన్ని కాపాడేందుకు మహాదేవశాస్త్రి (మోహన్ బాబు)తో  పాటు గూడెం పెద్దలు పరితపిస్తుంటారు. 'ఈ వాయులింగం కాపాడేందుకు నా ప్రాణాలు సైతం అర్పిస్తాను.' అంటూ మోహన్ బాబు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.


నాస్తికుడి నుంచి పరమ శివ భక్తుడిగా..


'వినపడని వాడికి విన్నపాలు ఎందుకు? వీళ్లకు దండాలెందుకు?' అంటూ మొదటి నుంచీ నాస్తికత్వంతో ఉండే తిన్నడు ఆయన పరమ భక్తుడిగా ఎలా మారాడు?, పరమ పవిత్రమైన, శక్తిమంతమైన వాయులింగాన్ని శత్రువుల బారి నుంచి ఎలా కాపాడాడు అనేదే ప్రధానాంశంగా ఈ మూవీ ఉండబోతుందని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. 


రుద్రుడిగా ప్రభాస్


ఈ సినిమాలో రుద్రుడిగా ప్రభాస్ నటిస్తుండగా.. ఆయన లుక్ భారీ హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్‌లో ఆయన ఎంట్రీ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. రుద్రుడిగా తిన్నడి దారిని భక్తి మార్గంలోకి మార్చినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 'నువ్వు నీ దేవుడు తోడు దొంగలే..' అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ లుక్స్, డైలాగ్స్ అదిరిపోయాయి. ఓ పవర్ ఫుల్ భక్తుడి కథను అద్భుత వీఎఫ్ఎక్స్‌తో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.



ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించగా.. 'మహాభారతం' సీరియల్ ఫేం ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మూవీలో మోహన్ బాబుతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, సప్తగిరి, శివబాలాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్టీఫెన్ దేవాన్సీ మ్యూజిక్ అందించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.


ఈ నెల 27న రిలీజ్


ఈ నెల 27న తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది 'కన్నప్ప'. ఇప్పటికే మూవీపై భారీ హైప్ క్రియేట్ కాగా.. ట్రైలర్‌తో అది రెండింతలైంది. ప్రస్తుతం మంచు విష్ణు మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.






Also Read: థ్రిల్లింగ్ సిరీస్ 'కేరళ క్రైమ్ ఫైల్స్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?