థియేటర్స్ బంద్ నేపథ్యంలో మొదలైన వ్యవహారం / వివాదం రోజుకొక కొత్త మలుపు తీసుకుని ముందుకు వెళుతోంది. 'హరిహర వీరమల్లు' విడుదలకు 'ఆ నలుగురు' కుట్ర చేశారని వచ్చిన కథనాలపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించడంతో బంద్ విరమించారు. కానీ కుట్ర చేయలేదని చెప్పలేదు. తన సినిమా విడుదలకు ముందు ఇబ్బందులు సృష్టించడంతో పవన్ నేరుగా రంగంలోకి దిగారు. ఘాటుగా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
'ఆ నలుగురి'లో నేను లేను... అల్లు అరవింద్Allu Aravind On Theatre Strike And Pawan Kalyan: ''ఇప్పుడు ప్రతిచోటా ఆ నలుగురు ఆ నలుగురు అంటున్నారు. నేను ఆ నలుగురిలో లేను. ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేశా. తెలంగాణాలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు... 'ఏఏఏ' (అమీర్‌పేట్‌లోని అల్లు అర్జున్ ఏషియన్ మల్టీప్లెక్స్) తప్ప! రెండు తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే... నాకు పదిహేను కూడా లేవు. త్వరలో ఆ థియేటర్స్ కూడా నా దగ్గర ఉండవు'' అని అల్లు అరవింద్ తెలిపారు. ఆ నలుగురిలో తనను కలపవద్దని మీడియాకు రిక్వెస్ట్ చేశారు.
పవన్ సినిమా విడుదల ముందు... దుస్సాహసమే!పవన్ కల్యాణ్ సినిమా విడుదలకు రాబోతుండగా థియేటర్లు మూసివేస్తామని పిలుపు ఇవ్వడం దుస్సాసం అని అల్లు అరవింద్ చెప్పారు. అటువంటి పనులు చేయకూడదని ఆయన అన్నారు.
Also Read: మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్న దిల్ రాజు? తెర వెనక కుట్రలా... ఇండస్ట్రీలో ఏం జరుగుతోందా?
పవన్ కళ్యాణ్ గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ... ''సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిన మనిషి పవన్. సినిమా పరిశ్రమకు సహకారం చేస్తున్న వ్యక్తి పవన్. 'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్ రేట్లు పెంచమని అడగడానికి పవన్ కల్యాణ్ దగ్గరకు మేమంతా వెళ్లాం. అప్పుడే ముఖ్యమంత్రిని కలవమని పవన్ సలహా ఇచ్చారు. కానీ, అధికారికంగా కలవడానికి తెలుగు చిత్రసీమ ప్రయత్నించలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా వాళ్లంతా వెళ్లి కలవాలి కదా!? కానీ, కలవలేదు. పవన్ కళ్యాణ్ ఆ సంగతి గుర్తు చేసినా అది జరగలేదు'' అని చెప్పారు. పవన్ ప్రశ్నలు కరెక్ట్... నేను ఆ లేఖ చదివా!పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి విడుదలైన లేఖను తాను చదివానని అల్లు అరవింద్ చెప్పారు. అందులో ప్రశ్నలు సరైనవే అని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఏపీ ముఖ్యమంత్రి గారిని కలవొచ్చు కదా అని నేనొక నిర్మాతను అడిగితే... 'మనది ప్రైవేటు వ్యాపారం కదా!? మనం కలవడం ఎందుకు?' అని అన్నారు. మరి గత ప్రభుత్వ హయాంలో ఎందుకు నిర్మాతలు అందరూ వెళ్లి కలిశారు?'' అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పేషీ నుంచి వచ్చిన లెటర్ చదివానని మరోసారి తెలిపారు.
పవన్ కళ్యాణ్ బాధలో నూటికి నూరు శాతం నిజం ఉందని అల్లు అరవింద్ అన్నారు. పవన్ సినిమా విడుదల ముందు థియేటర్లు మూసి వేస్తామని బెదిరిస్తున్నారా? అని ప్రశ్నించారు. థియేటర్లు మూసి వేయాలని తీసుకున్నది ఏకపక్ష నిర్ణయం అని, అందుకే తాను ఛాంబర్‌లో జరిగిన ఏ మీటింగులకూ హాజరు కాలేదని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. థియేటర్లు మూసివేత మీద ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి స్పందించిన తీరు సమంజసంగా ఉందని ఆయన తెలిపారు.
Also Read: థియేటర్స్ బంద్ కుట్ర వెనుక ద్వారంపూడి... వైసీపీ ఆటలో 'ఆ నలుగురు' పావులు అయ్యారా?
తనకు, ఆ నలుగురికి ఎటువంటి సంబంధం లేదని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. దాంతో ఇప్పుడు బాల్ మిగతా డిస్ట్రిబ్యూటర్స్ కోర్టులో పడిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్లు 'దిల్' రాజు, సురేష్ బాబు దగ్గర ఉన్నాయి. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నేపథ్యంలో వాళ్ళు ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
Also Read: టాలీవుడ్ 'కింగ్ పిన్'కు పవన్ కళ్యాణ్ చెక్‌మేట్... చిన్న గూగ్లీకి హడల్... దెబ్బకు సెట్టయ్యారా?