తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు మరొకడు ఉంటాడని సామెత. ఈ రోజు (మే 24, శనివారం) తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సమావేశం అయ్యాక ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ చెప్పిన మాటలు వింటుంటే అదే నిజమని అనిపిస్తుందని టాలీవుడ్ నిర్మాతలు ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యానిస్తున్నారు.

Continues below advertisement


థియేటర్స్ బంద్ చేయడం లేదని అనౌన్స్ చేశాక తనను తాను టాలీవుడ్ 'కింగ్‌ పిన్‌'గా ఊహించుకున్న ఓ బడా నిర్మాతకు చిన్న గూగ్లీతో, అది కూడా తమ పార్టీకి చెందిన మంత్రితో ఇప్పించిన ప్రెస్ నోట్ ద్వారా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారనేది ఇండస్ట్రీ జనాల చర్చల్లో వినబడుతోంది. చిన్న ఝలక్ ఇచ్చేసరికి పెద్దలం అని చెప్పుకొనే వారంతా సెట్ అయ్యారని ఎగ్జిబిషన్ -  డిస్ట్రిబ్యూషన్ - ప్రొడ్యూసర్స్ సర్కిల్స్‌లో నవ్వుకుంటున్నారు. మే 23 (శుక్రవారం ఉదయం) నుంచి మే 24 (శనివారం మధ్యాహ్నం) వరకు జరిగిన పరిణామాలు చూస్తే సామాన్యులకు సైతం ఒక క్లారిటీ వస్తుంది.


బంద్ చేయడం లేదు...
పవన్ సినిమాకు అడ్డుగా లేం!
పర్సెంటేజ్ సిస్టం కావాలని మొదట కోరుకున్నది ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు. తమ డిమాండ్స్ చెప్పి డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం అయ్యారు. అదీ ఏప్రిల్ 19న. ఆ మీటింగ్‌లో పర్సెంటేజ్ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోలేదు. ఇవ్వకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు అనౌన్స్ చేశారు. అప్పుడు 'హరిహర వీరమల్లు'ను మే 9న విడుదల చేయాలని అనుకున్నారు. అసలు రిలీజ్ మీద క్లారిటీ లేదు. అందులో పవన్ సినిమాను అడ్డుకోవాలనే ప్లాన్ ఏమీ లేదు. 


ఈస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్‌లో ఉంటూ ఎగ్జిబిషన్ - డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మీద గ్రిప్ పెంచుకున్న వ్యక్తుల దగ్గరకు వచ్చినప్పుడు సమస్య మొదలైంది. తమ ఆధిపత్యం కోసం పావులు కదపడం మొదలు పెట్టారట. మెల్లగా సమావేశాలు పెట్టి వేడి పెంచారు. పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'ను విడుదలకు రెడీ చేసి, ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత కూడా జూన్ 1న బంద్ అనేది ఆపలేదు. ఆ నోటా ఈ నోటా ఇది పవన్ కళ్యాణ్ సన్నిహితుల వరకు వెళ్ళింది. 


తెర వెనుక ఏం జరిగాయో... జనసేన పార్టీకి చెందిన, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కందుల దుర్గేష్ నుంచి ప్రెస్ నోట్ వచ్చింది. 'హరిహర వీరమల్లు' విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురూ ఒత్తిడి చేస్తున్నారని వార్తలొచ్చాయని, దానిపై విచారణ చేయాలని హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. దాంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. హుటాహుటిన శనివారం ఉదయం సమావేశం అయ్యారు. బంద్ గింద్ లేదని క్లారిటీ ఇచ్చారు. పవన్ సినిమాకు ఎటువంటి ఆటంకాలు లేవని, ఆ సినిమా ఆగదని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫిల్మ్ ఛాంబర్ స్పష్టత ఇచ్చింది.


ప్రభుత్వ జోక్యం వద్దు...
మేం సాల్వ్ చేసుకుంటాం!
ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ మీటింగ్ తర్వాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మాట్లాడారు. అదేదో సినిమా (హరిహర వీరమల్లు) ఆగుతుందన్నారని, ఇప్పుడు (థియేటర్స్ బంద్) లేకపోవడం వల్ల ఆ సమస్య లేదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా పేరు కూడా ఆయన ప్రస్తావించలేదు. తాము థియేటర్లు బంద్ చేయడం లేదని, ఎటువంటి ఊహాగానాలు వ్యాప్తి చేయవద్దని, అలా చేయడం వల్ల చిత్రసీమలో ఆటంకాలు (సమస్యలు) వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.


ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం హీరో మాత్రమే. కానీ, ఇప్పుడు? ఏపీకి డిప్యూటీ సీఎం. జనసేన పార్టీకి అధినేత. అందులోనూ ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే దగ్గర ఉంది. అయితే పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఇండస్ట్రీ కోరిన వరాలు ఇచ్చారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి హీరోలను తన దగ్గరకు వచ్చేలా చేస్తే, నిర్మాతలు వస్తే చాలని పవన్ చెప్పారు. టికెట్ రేట్స్ పెంచుకోవడానికి లైన్ క్లియర్ చేశారు. ఇండస్ట్రీ నుంచి టికెట్ రేట్స్ అధ్యాయనం చేయడానికి ఒక కమిటీ వేయమన్నారు. అడిగినవన్నీ చేస్తున్నారని కాబోలు ఆయన్ను లైట్ తీసుకున్నట్టు ఉన్నారు. ఏమీ చేయరని, సైలెంట్‌గా ఉంటారని అనుకున్నారు. అనూహ్యంగా కందుల దుర్గేష్ నుంచి ప్రెస్ రిలీజ్ వచ్చేసరికి ఉలిక్కిపడ్డారు. తమ సమస్యల పరిష్కారానికి వేరొకరి (ప్రభుత్వ) జోక్యం అవసరం లేదని మెల్లగా సెలవిచ్చారు.


Also Read: 'ఆ నలుగురు' ఎవరు? అగ్ర నిర్మాతలేనా? ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారా?? వాళ్ళ చేతుల్లో ఏముంది??


''మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం... బయట నుంచి వచ్చి ఎవరూ సాల్వ్ చేయరు. ఈ నెల 30న ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అవుతుంది. అన్ని సెక్టార్స్ పరిగణలోకి తీసుకుని ఈ సమస్య మీద అందులో కమిటీ వేస్తాం. అది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. ఈ విషయంపై అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడతాం. గతంలోనూ కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించడం జరిగింది. ఒక సినిమాను టార్గెట్ చేసి థియేటర్లు బంద్ చేస్తున్నారనే వార్తను ఖండిస్తున్నాం'' అని దామోదర ప్రసాద్ తెలిపారు. 


ప్రభుత్వం గనుక జోక్యం చేసుకోవాలని అనుకుంటే దాన్ని ఎవరూ ఆపలేరు. పైగా, ప్రభుత్వం కమిటీ వేస్తుంది. అది ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమవుతుందనేది టికెట్ రేట్స్ మీద జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఇండస్ట్రీకి తెలిసి వచ్చింది. ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటే... ఇండస్ట్రీ మీద తమకు తాము 'కింగ్‌ పిన్‌' అనుకునే వ్యక్తుల ఆధిపత్యానికి గండి పడుతుంది. వాళ్ళ పప్పులు ఉడకవు. అందుకని మెల్లగా బంద్ పక్కన పెట్టి తమ సమస్యలు తాము పరిష్కరించుకుంటామని తెలిపారు. ఓ ప్రభుత్వం పదవి ఇచ్చిందని, తనను సినిమా ఇండస్ట్రీ అంతటికీ రాజుగా ఊహించుకుని మరో ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న రాజును ఢీ కొట్టేస్తాం, కొట్టేయగలం అనుకుంటే ఎలా? యాభై సినిమాలు తీసిన ఆ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో!?


Also Readమెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్న దిల్ రాజు?  తెర వెనక కుట్రలా... ఇండస్ట్రీలో ఏం జరుగుతోందా?