టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం నిర్మాత ఒకరు మృతి చెందారు. సినిమాలపై ప్రేమతో రియల్ ఎస్టేట్ రంగం నుంచి మూవీ ప్రొడక్షన్‌లోకి వచ్చిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్మాత ఎవరు? ఏయే సినిమాలు ప్రొడ్యూస్ చేశారు? వంటి వివరాల్లోకి వెళితే...
'అల్లరి' నరేష్ హీరోగా సినిమాలు...
నిర్మాత వేదరాజు టింబర్ ఇక లేరు
అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్ జంటగా నటించిన 'మడత కాజా' సినిమా గుర్తు ఉందా? దానితో పాటు 'అల్లరి' నరేష్ ఓ హీరోగా రూపొందిన మరో సినిమా 'సంఘర్షణ'? ఆ రెండు చిత్రాల నిర్మాత ఒక్కరే. ఆయన పేరు వేదరాజు టింబర్ (Vedaraju Timber).
హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఉదయం నిర్మాత వేదరాజు టింబర్ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ సిటీలోని ఏఐజీ ఆస్పత్రిలో వేదరాజు టింబర్ చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వస్తారని సన్నిహితులు, కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో మృతి చెందటం వారందరిలో విషాదాన్ని నింపింది.
వేదరాజు టింబర్ (Vedaraju Timber Family Details)కు భార్య, కుమార్తె ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ నగరంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమాలపై ఇష్టంతో ఓ వైపు కనస్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ చిత్రసీమలో ప్రవేశించారని... త్వరలో మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో దుర్ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు వివరించారు. వేదరాజు టింబర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.