Akshay Kumar in Mumbai Metro: సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేసులలో ఎక్కడ కనిపించినా.. తమ ఫ్యాన్స్ చుట్టుముట్టేస్తారు. అందుకే బౌన్సర్లు లేకుండా ఎక్కువగా పబ్లిక్ ప్లేసులలోకి వెళ్లరు సెలబ్రిటీలు. కానీ ఒక బాలీవుడ్ స్టార్ హీరో మాత్రం ఏకంగా ముంబాయ్ మెట్రోలో ఒంటరిగా ప్రయాణం చేశాడు కూడా. ఆశ్చర్యం ఏంటంటే తనను మాస్క్‌లో చూసి ఎవరూ గుర్తుపట్టలేదు. తను మరెవరో కాదు.. అక్షయ్ కుమార్. అక్షయ్‌ను మాస్క్‌లో చూసి చాలామంది గుర్తుపట్టకపోయినా.. కొందరు మాత్రం అనుమానంతో ఫోటోలు, వీడియోలు తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి.


ఎవరూ గుర్తుపట్టలేదు


వైరల్ అవుతున్న ఈ ఫోటోలు, వీడియోల్లో అక్షయ్ కుమార్ ముంబాయ్ మెట్రోలోని ఒక కార్నర్ సీట్‌లో కూర్చొని ఉన్నాడు. తన పక్కనే కొందరు నిలబడి ఉన్నారు. అయినా అక్షయ్‌ను గుర్తుపట్టలేకపోయారు. అక్షయ్ ఫుల్‌గా బ్లాక్ దుస్తులు ధరించి, క్యాప్ పెట్టుకొని ఉన్నాడు. కానీ తనకు కొంచెం దూరంలో ఎదురుగా కూర్చున్న ఒక వ్యక్తి గుర్తుపట్టి వీడియో తీయడంతో ఈ విషయం బయటికొచ్చింది. చాలామంది ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. అక్షయ్ కుమార్‌లాంటి వ్యక్తి తమతో పాటు మెట్రోలో ప్రయాణిస్తున్నాడా అని అనుకున్నారు. ఇక ఈ హీరోకు ముంబాయ్ మెట్రోలో ప్రయాణించడం అలవాటే. ఇంతకు ముందు కూడా పలుమార్లు తన సినిమా ప్రమోషన్స్ కోసం మెట్రో ఎక్కాడు అక్షయ్.






మెట్రోలో అక్షయ్ డ్యాన్సులు


2023లో ఇమ్రాన్ హష్మీతో కలిసి ‘సెల్ఫీ’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటించాడు అక్షయ్ కుమార్. ఇక ఆ మూవీ ప్రమోషన్స్ కోసం ఒకరోజు ఉదయం డీఎన్ నగర్ మెట్రో స్టేషన్‌లో మెట్రో ఎక్కాడు. ఆ సమయంలో ఇమ్రాన్ హష్మీ కూడా తనతోనే ఉన్నాడు. మెట్రోలో ఒక్కసారిగా తమ అభిమాన హీరోను చూసి షాక్ అయ్యారు ఫ్యాన్స్. తనతో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అంతే కాకుండా మెట్రోలో ఫ్యాన్స్‌తో కలిసి తన ఎవర్‌గ్రీన్ పాట ‘మే ఖిలాడీ తూ అనారీ’ పాటకు స్టెప్పులు కూడా వేశాడు. ఇక అప్పట్లో అక్షయ్ కుమార్ చేసిన ఈ వెరైటీ ప్రమోషన్స్, మెట్రోలో ఫ్యాన్స్‌తో కలిసి తను వేసిన స్టెప్పులు తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా అక్షయ్ మరోసారి మెట్రోలో ప్రయాణించడం చూసి అప్పటిరోజులను గుర్తుచేసుకున్నారు అభిమానులు.


పారితోషికం తీసుకోకుండా..


ఇక సినిమాల విషయానికొస్తే.. అక్షయ్ కుమార్ చివరిగా ‘ఓఎమ్‌జీ 2’ అనే చిత్రంలో కీలక పాత్రలో కనిపించాడు. బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వినిపించాయి. కానీ కొందరు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా చాలా బాగుందని, మంచి మెసేజ్ ఇచ్చిందని ప్రశంసించారు. ఇక ఇలాంటి ఒక మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అక్షయ్ ఫ్రీగా నటించాడని, అసలు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని దర్శకుడు బయటపెట్టడంతో తన ఫ్యాన్స్ అంతా హీరోను ప్రశంసించారు. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్‌తో కలిసి ‘బడే మియా చోటే మియా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదొక ఫుల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది.


Also Read: కుక్కచావు చచ్చేలా చేస్తా - షారుఖ్ వ్యాఖ్యలు ‘యానిమల్’ పైనేనా?