Shah Rukh Khan about Animal: సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చిందో.. అంతే నెగిటివిటీ కూడా వచ్చింది. అయినా కూడా ఈ మూవీ కలెక్షన్స్ పరంగా సెన్సేషనల్ హిట్‌ను అందుకుంది. అయితే ఇందులో హీరోగా నటించిన రణబీర్ కపూర్ పాత్రకు చాలా నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. అందుకే ఈ పాత్రపై ఇప్పటికే చాలామంది మహిళా ప్రేక్షకులు మండిపడ్డారు. ప్రేక్షకులు మాత్రమే కాదు.. పలువురు సెలబ్రిటీలు కూడా రణబీర్ పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా ‘యానిమల్’పై, అందులో రణబీర్ పాత్రపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు.


ఒకప్పుడు నెగిటివ్ రోల్స్..


బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఎక్కువగా రొమాంటిక్ సినిమా, లవర్ బాయ్ పాత్రలు చేస్తూనే క్రేజ్‌ను సంపాదించుకున్నారు. కానీ కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో నెగిటివ్ రోల్‌లో కూడా కనిపించారు. లవర్ బాయ్‌గా ఇమేజ్ సంపాదించుకోవడంతో నెగిటివ్ రోల్స్‌కు దూరంగా ఉన్నారు. ఇక మళ్లీ నెగిటివ్ రోల్స్‌లో నటించడంపై షారుఖ్ స్పందించాడు. తాజాగా షారుఖ్ ఖాన్‌కు ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ దక్కింది. ఈ అవార్డ్ అందుకున్న తర్వాత చాలా విషయాలపై షారుఖ్ స్పీచ్ ఇచ్చారు. తన కెరీర్‌లో ఎదుర్కున్న ఎన్నో విషయాలను గుర్తుచేసుకున్నారు, తన ఫ్యాన్స్‌ను మోటివేట్ చేశారు. అంతే కాకుండా ఒకవేళ తాను నెగిటివ్ పాత్రలు పోషిస్తే.. ఎలా ఉంటుంది అనే విషయంపై మాట్లాడారు.


చాలా బాధపడేలా చూసుకుంటాను..


ఒకవేళ తాను నెగిటివ్ పాత్రలో కనిపిస్తే.. ఆ పాత్ర కుక్క చావు చచ్చేలా చూసుకుంటానని షారుఖ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను చాలా ఆశతో జీవించి, హ్యాపీ కథలు వినిపించాలనుకునే మనిషిని. నేను పోషించే పాత్రలు మంచి పనులు చేస్తాయి. సంతోషాన్ని, ఆశను పంచుతూ ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ నేను నెగిటివ్ రోల్ చేస్తే ఆ పాత్ర చాలా బాధపడేలా చూసుకుంటాను. కుక్క చావు చచ్చేలా చేస్తాను. ఎందుకంటే మంచితనం మాత్రమే మంచిని సృష్టించగలదని నేను నమ్ముతాను. అలాగే చెడ్డతనాన్ని తన్నాలి. నేను ప్రేక్షకుల కలలు కనడానికి భయపడకుండా ఉండేలా నిజాయితీగల పాత్రలు చేయాలి. నా కష్టాన్ని జీవతం వృథా చేయదు అనే నమ్మకంతో నేను ఇంకా ఎక్కువ కష్టపడుతూనే ఉంటాను’’ అని చెప్పారు షారుఖ్ ఖాన్.


జావేద్ అఖ్తర్ కూడా..


ఇక నెగిటివ్ రోల్స్ గురించి షారుఖ్ ఖాన్ ఇంత ప్రత్యేకంగా మాట్లాడడం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. ఇవి కచ్చితంగా ‘యానిమల్’లో రణబీర్ కపూర్ పాత్రను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జావేద్ అఖ్తర్ కూడా ‘యానిమల్’ మూవీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘ఒక సినిమాలో అమ్మాయిను షూ నాకమని, అమ్మాయిని కొట్టడం కరెక్టే అని చూపించినప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయితే అది చాలా భయంకరమైన విషయం’’ అని జావేద్ అన్నారు. దీనిపై ‘యానిమల్’ టీమ్ కూడా ఘాటుగానే స్పందించింది.


Also Read: న్యూ లుక్ అదిరింది, మహేశ్ స్టైలిష్ ఫోటోను షేర్ చేసిన నమ్రత - 'రాక్ చేద్దాం' అంటూ కామెంట్స్