Sarfira Vs Udaan: తమిళ హీరో సూర్య, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సూరరై పొట్రు'. డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 2020 లో కోవిడ్ పాండమిక్ కారణంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజ్ చేశారు. ఇది 'ఆకాశం నీ హద్దురా' పేరుతో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని 'సర్ఫిరా' అనే టైటిల్ తో హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. సుధా కొంగర డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు దీనికి పోటీగా అదే రోజున హిందీ డబ్బింగ్ వెర్షన్ వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
'సర్ఫిరా' చిత్రాన్ని జులై 12న గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసారు. దీనికి తగ్గట్టుగానే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అదే రోజున ఒరిజినల్ మూవీ డబ్బింగ్ వెర్షన్ ను టీవీల్లో ప్రసారం చేస్తున్నారు. 'సూరరై పొట్రు' హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకున్న గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ సంస్థ.. 'ఉడాన్' అనే పేరుతో ఈ శుక్రవారం ఉదయం గం. 11:40 నిమిషాలకు టెలివిజన్ ప్రీమియర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ ప్రోమో వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు.
థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాకి పోటీగా, అదే సమయంలో దాని ఒరిజినల్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ని విడుదల చేయడం సరికాదని అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'సర్ఫిరా' ఓపెనింగ్స్ ను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కావాలనే ఇలా చేస్తున్నారని.. ఇది పరోక్షంగా మేకర్స్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టెలివిజన్ ప్రీమియర్ ను ఆపేయడం, లేదా స్ట్రీమింగ్ తేదీని మార్చుకోవడమే చేయకపోతే.. 'సర్ఫిరా'కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అందులోనూ ఇది సూర్య తన హోమ్ బ్యానర్ లో నిర్మించిన సినిమా కావడంతో, ఎంతో కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ వారు గతంలో 'అల వైకుంఠపురంలో' హిందీ రీమేక్ రిలీజ్ టైంలోనూ ఇలానే వ్యవహరించారు. 'షెహజాదా' విడుదల రోజునే, దాని ఒరిజినల్ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను ప్రసారం చేస్తున్నట్లుగా అనౌన్స్ చేసారు. కానీ ఎందుకనో చివరి నిమిషంలో వెనక్కి తగ్గి, థియేట్రికల్ రిలీజైన కొన్ని రోజులకు టీవీలో స్ట్రీమింగ్ చేసారు. ఇప్పుడు 'సర్ఫిరా' విడుదలను దృష్టిలో పెట్టుకొని, 'ఆకాశం నీ హద్దురా' హిందీ డబ్బింగ్ 'ఉడాన్' టెలివిజన్ ప్రీమియర్ విషయంలో గోల్డ్ మైన్స్ పునరాలోచన చేస్తారేమో చూడాలి.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా 'సర్ఫిరా' చిత్రాన్ని తెరకెక్కించారు. సామాన్యులకు విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించాలానే లక్ష్యంతో.. ఒక సాధారణ పైలట్ సొంతంగా విమానయాన సంస్థను నెలకొల్పడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు? ప్రయాణికులకు తక్కువ ధరకే ఫ్లైట్ లో ప్రయాణించే అవకాశం కల్పించడానికి ఎలాంటి కృషి చేశారు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందించారు. మాతృకకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సూర్య తన అద్భుతమైన యాక్టింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. ఇప్పుడు హిందీలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
'సర్ఫిరా' చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన రాధిక మదన్ హీరోయిన్ గా నటించింది. పరేష్ రావల్, సీమా విశ్వాస్, కృష్ణ కుమార్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. హీరో సూర్య క్యామియో అప్పీరియన్స్ ఇవ్వనున్నారు. అబుండాంటియా ఎంటర్టైన్మెంట్, 2D ఎంటర్‌టైన్మెంట్, కేఫ్ ఆఫ్ గుడ్ హోప్స్ బ్యానర్స్ పై అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా, సూర్య, జ్యోతిక సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
Also Read: మైత్రీ చేతికి మరో బిగ్ ప్రాజెక్ట్ - 'ది గోట్' మూవీ తెలుగు రైట్స్, ఎన్ని కోట్లంటే?