Akhil Akkineni: బ్లాక్ బస్టర్ హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు అక్కినేని అఖిల్. సినిమా కోసం ఎంతగా కష్టపడుతున్నా, తన శక్తినంతా దారపోస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎన్ని ప్రయోగాలు చేసినా అదృష్టం కలిసిరావడం లేదు. చివరగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా ఇంతవరకూ అక్కినేని వారసుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచే ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. 'Akhil 6' ఒక వార్ బ్యాక్ డ్రాప్ మూవీ అని టాక్. గతంలో రాధేశ్యామ్, సాహో సినిమాలకి వర్క్ చేసిన అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. దీనికి 'ధీర' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళకముందే అఖిల్ మరో ప్రాజెక్ట్ ను లాక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.


అఖిల్ తన 7వ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ లో చేయడానికి రెడీ అవుతున్నారట. 'వినరో భాగ్యము విష్ణు కథ' డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు. ఇది చిత్తూరు బ్యాక్ డ్రాప్ రూరల్ డ్రామా అని, ఇప్పటికే దర్శకుడు అక్కినేని నాగార్జునకు స్టోరీ నేరేట్ చేశారని టాక్ వినిపిస్తోంది. కథ నచ్చడంతో నాగ్ హోమ్ ప్రొడక్షన్ లో నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే 'హలో' తర్వాత సొంత బ్యానర్ లో అఖిల్ చేసే రెండో సినిమా ఇదే అవుతుంది.


ఇదిలా ఉంటే 'Akhil 8' కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లుగా మరో వార్త కూడా అక్కినేని ఫ్యాన్స్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో అఖిల్ ఓ సినిమా చేయనున్నట్లుగా చెబుతున్నారు. గౌతమ్ మీనన్ గతంలో 'ఏమాయ చేసావే' సినిమాతో అక్కినేని నాగచైతన్య కెరీర్ ను గాడిలో పెట్టారు. ఆ తర్వాత 'సాహసం శ్వాసగా సాగిపో' చేశారు. కొన్నాళ్లుగా ఆయన డైరెక్షన్ కంటే యాక్టింగ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి అఖిల్ తో సినిమా చేస్తారో లేదో వేచి చూడాలి. 


'మనం' మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన అఖిల్ అక్కినేని.. 2015లో 'అఖిల్' చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఇది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. దీని తర్వాత వచ్చిన 'హలో' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ వసూళ్లు రాబట్టలేకపోయింది. 'మిస్టర్ మజ్ను' నిరాశ పరచగా.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. కానీ 'ఏజెంట్' మూవీ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి అఖిల్ రెడీ అవుతున్నారు. మరి అక్కినేని వారసుడు రాబోయే చిత్రాలతో భారీ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.


Also Read: అక్షయ్ కుమార్ 'సర్ఫిరా'కు పోటీగా వస్తున్న 'ఆకాశం నీ హద్దురా' హిందీ డబ్బింగ్ వెర్షన్!