వైవిధ్యమైన సినిమాలు, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. అయితే ఇటీవల 'పుష్ప'లోని శ్రీవల్లి పాత్ర గురించి చేసిన కామెంట్స్ ఆమెను అనవసరంగా చిక్కుల్లో పడేశాయి. ఆ క్యారెక్టర్ లో రష్మిక మందన్న కంటే తాను ఇంకా బాగా చేసేదాన్నని ఐశ్వర్య అన్నట్లు వార్తలు రావడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. దీంతో తన వ్యాఖ్యలపై ఐశ్వర్య వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ తాజాగా ఆమె తన టీమ్ ద్వారా ఓ ప్రకటన రిలీజ్ చేసింది.


సినీ ఇండస్ట్రీలో ఇన్నాళ్ళుగా తనకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ఐశ్వర్య రాజేష్ కృతజ్ఞతలు తెలిపింది. “తెలుగు సినిమాలో నేను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు. నాకు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే చాలా ఇష్టమని, నాకు నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తానని బదులిచ్చాను. ఉదాహరణగా చెప్పాలంటే, 'పుష్ప'లోని శ్రీవల్లి పాత్ర నాకు చాలా నచ్చిందని, అలాంటి పాత్రలు నాకు సరిపోతాయని నేను బదులిచ్చాను'' అని ఐశ్వర్య వివరణ ఇచ్చింది. అయితే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 


"దురదృష్టవశాత్తు, నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక మందన్న అద్భుతమైన వర్క్ ని నేను కించపరుస్తున్నట్లు ముద్ర వేసే విధంగా వక్రీకరించారు. రష్మిక పని పట్ల నాకు ప్రగాఢమైన అభిమానం తప్ప మరేమీ లేదని, నా తోటి నటీనటులందరిపై నాకు అపారమైన గౌరవం ఉందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను." అని ఐశ్వర్య రాజేష్ ప్రకటనలో పేర్కొన్నారు. దయచేసి తన మాటలను తప్పుగా నివేదించేలా రూమర్స్ క్రియేట్ చేయడాన్ని ఆపాలని ఈ సందర్భంగా ఆమె కోరింది.


కాగా, 'పుష్ప' చిత్రంలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్నకు మంచి మార్కులు పడ్డాయి. ఇది ఆమెకు ఇతర భాషల్లోనూ ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టడమే కాదు.. బాలీవుడ్ లో అవకాశాలు రావడానికి కారణమైంది. రీసెంట్ గా 'ఫర్హానా' మూవీ ప్రమోషన్లలో భాగంగా ఐశ్వర్య రాజేష్ అలాంటి రోల్స్ తనకు బాగా సూట్ అవుతాయని కామెంట్స్ చేసింది. అయితే అవకాశం వస్తే ఆ పాత్రలో రష్మిక కంటే తాను మెరుగ్గా నటించేదాన్ని అని ఐశ్వర్య అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో రష్మిక ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య తన స్టేట్మెంట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇస్తూ నోట్ రిలీజ్ చేసింది. రష్మిక పట్ల తనకు ప్రగాఢమైన అభిమానం తప్ప మరేమీ లేదని పేర్కొంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఇటీవల రిలీజైన 'ఫర్హానా' ట్రైలర్ ను రష్మిక మందన్న లాంచ్ చేసింది. కాబట్టి ఐశ్వర్య కచ్చితంగా ఆమెను కించపరిచేలా వ్యాఖ్యలు చేయదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 


తమిళ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న ఐశ్వర్య రాజేష్.. 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మిస్ మ్యాచ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' 'టక్ జగదీశ్' లో 'రిపబ్లిక్' 'డ్రైవర్ జమున' వంటి సినిమాలలో నటించింది. ఈ ఏడాదిలో 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' 'రన్ బేబీ రన్' 'సొప్పన సుందరి' చిత్రాలతో అలరించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఫర్హానా' మూవీ పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ ప్రభు నిర్మించారు.


Read Also: ప్రతీకారంతో తిరిగొస్తున్న భన్వర్ సింగ్ షెకావత్ - 'పుష్ప 2' క్రేజీ అప్‌డేట్