ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ''పుష్ప: ది రైజ్''. రెండేళ్ల కిందట థియేటర్లలో సందడి చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఎలాంటి అంచనాలు లేకుండా సంచలన విజయాన్ని సాధించింది. పుష్పరాజ్ గా బన్నీ నటనతో పాటుగా పాటలు, తగ్గేదెలే వంటి డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు 'పుష్ప 2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి, చిత్ర బృందం తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ అందించారు. 


శేషాచలం అడవుల్లోని ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో, 'పుష్ప: ది రైజ్' కు కొనసాగింపుగా 'పుష్ప: ది రూల్' చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. తాజా షెడ్యూల్ లో ఫహద్ మీద కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా సెట్ లో ఫహద్ కు డైరక్టర్ సుకుమార్ సీన్ వివరిస్తున్న ఓ ఫోటోని షేర్ చేశారు.


'భన్వర్ సింగ్ షెకావత్' అకా ఫహద్ ఫాసిల్ తో #Pushpa2TheRule కీలక షెడ్యూల్ పూర్తయింది. ఈసారి అతను ప్రతీకారంతో తిరిగి వస్తాడు అని 'పుష్ప' టీమ్ ట్వీట్ చేసింది. 'పుష్ప' పార్ట్-1 లో భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ గా ఫాహాద్ నటించాడు. కనిపించింది కొన్ని నిమిషాలే అయినా, 'పార్టీ లేదా పుష్పా!' అంటూ ఆకట్టుకున్నాడు. 


క్లైమాక్స్ లో భన్వర్ సింగ్ ను అవమానించి, పుష్పరాజ్ పైచేయి సాధించడంతో 'పుష్ప' మొదటి భాగం ఎండ్ అవుతుంది. ఇప్పుడు 'పుష్ప 2' లో పుష్పరాజ్ పై షెకావత్ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే 'అతను ఈసారి ప్రతీకారంతో తిరిగి వస్తాడు' అని మేకర్స్ ట్వీట్ చేశారు. దీన్ని బట్టి రెండో భాగంలో అల్లు అర్జున్, ఫహద్ మధ్య వార్ గట్టిగానే ఉండబోతోందని అర్ధమవుతుంది.


కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది 'పుష్ప: ది రైజ్' లో చూపించారు. ఇప్పుడు 'పుష్ప: ది రూల్' లో భన్వర్ లాల్ నుంచి పుష్పరాజ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? శత్రువులను ఎలా కంట్రోల్ లో పెట్టాడు? నేర సామ్రాజ్యాన్ని ఎలా పాలించాడు? అనేది చూపించబోతున్నారు. ఫస్ట్ పార్ట్ కి వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని 'పుష్ప 2' చిత్తాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అందుకే స్క్రిప్టు దశలోనే ఎక్కువ సమయం తీసుకున్నారు.


ఇప్పటికే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ విడుదల చేసిన వీడియోకి మంచి స్పందన లభించింది. పుష్ప జైలు నుంచి తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, అతడి కోసం పోలీసుల గాలింపు చర్యలు, పుష్పరాజ్ కోసం ప్రజలు తిరగబడడం వంటివి చూపించారు. 'అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే దాని అర్థం, పులి వచ్చిందని.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వస్తే.. పుష్ప వచ్చాడని అర్థం' అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.


'పుష్ప 1' లో ప్రధాన పాత్రలను కొనసాగిస్తూనే.. మరికొంతమంది స్టార్ కాస్ట్ ను భాగం చేయనున్నారని తెలుస్తోంది. శ్రీవల్లి పాత్రతో పాటుగా భన్వర్ లాల్ షెకావత్, మంగళం శీను, దాక్షాయని పాత్రలు కంటిన్యూ అవుతాయి. కొత్తగా జగపతి బాబు లాంటి మరికొందరు నటీనటులు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే వైజాగ్, మారేడుమిల్లి అడవులు, రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'పుష్ప 2' చిత్రం 2024 లో ప్రేక్షకుల ముందుకి రానుంది. 


Read Also: రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? అదే సూపర్ స్టార్ లాస్ట్ మూవీనా?