మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్‌లో రెండో భాగం ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానుంది. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, శోభిత ధూళిపాళ, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, జయరాం, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్ సహా పలువురు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో రెండో భాగం సరిగ్గా అక్కడే మొదలు కానుంది. సముద్రంలో జరిగే ఫైట్‌తో ఈ సినిమా మొదలుకానుంది.


వారసుడైన అరుల్‌మొళి వర్మన్ (జయం రవి) చనిపోయాడని భావించి రాజ్యాన్ని రెండు ముక్కలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. చోళ రాజైన అరుల్‌మొళి వర్మన్‌‌ను చంపామనుకుని పాండ్యులు ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ని కూడా చంపాలని ప్లాన్ వేస్తారు. దీని తర్వాత జరిగే పర్యవసనాల నేపథ్యంలో సినిమా ఉండనుంది.


మీడియా ప్రశ్నకు ఐశ్వర్య ఆసక్తికర సమాధానం


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. చోళయాత్ర పేరుతో ఈ చిత్రం బృందం దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ప్రధాన నగరాల్లో ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రెస్ మీట్లు, టీవీ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో తనకు ఎదురైన ప్రశ్నకు అందాల తార ఐశ్వర్య రాయ్ చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. సౌత్ సినిమాలు నార్త్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయని  భావించవచ్చా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు నొప్పించక తానొవ్వక అనే రీతిలో సమాధానం చెప్పారు.


నా దృష్టిలో కళ అనేది ఎక్కడైనా ఒకటే!


తన దృష్టిలో కళ అనేది ఎక్కడైనా ఒకటే అని చెప్పుకొచ్చారు ఐశ్వర్య. “నాకు సంబంధించినంత వరకు సౌత్, నార్త్ అనే తేడా లేదు. దేశంలోని ఏ ఇండస్ట్రీ అయినా భారతీయ సినిమా ఇండస్ట్రీగానే భావిస్తున్నాను. ఒక సినిమా పరిశ్రమపై మరొక సినిమా పరిశ్రమ డామినేషన్ చేస్తుంది అనే అభిప్రాయాన్ని నేను అంగీకరించను. ఒకచోట అవకాశాలు రాకపోతే ఇంకో చోటుకి, అక్కడ అవకాశాలు రాకపోతే మరొక చోటుకి వెళ్లొచ్చు. కళాకారులు ఎక్కడైనా కళాకారులే. ప్రతి సినిమా పరిశ్రమ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను సౌత్ టాప్ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్ తో సినిమాలు చేశాను. ఈ సినిమా పరిశ్రమ గొప్పది. ఇతర సినిమా పరిశ్రమలు గొప్పవి కాదు అనే దానికి నేను వ్యతిరేకం” అని ఐశ్వర్యరాయ్ తెలిపారు.


Also Read 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?


గత ఏడాది విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ తమిళంలో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయినప్పటికీ, మిగతా భాషల్లో ఆశించిన స్థాయి స్పందన రాలేదు. పాత్రల పేర్లే అర్థం కాలేదని, సినిమా బాగా స్లోగా ఉందని కామెంట్లు వినిపించాయి. మరి రెండో భాగానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో చూడాలి.


Read Also: టైమ్ వచ్చినప్పుడు కాదు, ఇష్టం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి - ఆ యాడ్‌తో సమంత సెటైర్లు!