అందాల తార సమంతా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తమిళంలో కూడా చక్కటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. గత కొంత కాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె, తాజాగా ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది.
పెప్సీ యాడ్ లో తళుక్కున మెరిసిన సమంతా
తాజాగా ఈ ముద్దుగుమ్మ అందరికీ షాక్ ఇస్తూ, చడీ చప్పుడు లేకుండా పెప్సీ ఇండియా యాడ్ లో దర్శనం ఇచ్చింది. సదరు కూల్ డ్రింక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాదు, పెప్సీ యాడ్ ను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ‘రైజ్ అప్ బేబీ’ అంటూ ఫుల్ యాక్టివ్ గా కనిపించింది.
పెప్సీ యాడ్ ప్రారంభంలో సమంతా వధువుగా కనిపించింది. మహిళలు టైమ్‌కు పెళ్లి చేసుకోవాలి అని మహిళలు ఎగతాళి చేయడంపై ఆమె రియాక్ట్ అవుతుంది. ‘‘టైమ్‌కు కాదు, ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి’’ అని సమాధానం చెప్తుంది. అపార్ట్ మెంట్ కు ఆలస్యంగా తిరిగి రావడంతో, సెక్యూరిటీ గార్డు రాత్రి 12 గంటలకు పూర్తయ్యే పనులు ఏముంటాయో అని అంటాడు. ‘‘అవును అర్థరాత్రి 12 గంటలకు కూడా పని పూర్తవడం లేదు’’ అని సమాధానం ఇస్తుంది. సినిమా షూటింగ్‌లో ‘‘యాక్షన్ సన్నివేశాలు హీరో మాత్రమే చేస్తాడు’’ అని అంటే.. ‘‘కానీ, ఈ సినిమాలో హీరో నేను’’ అంటూ ఫైటర్లను తన్నుతుంది. .‘‘అందరి మాటలు వింటూ కూర్చుంటే.. నీకు నువ్వుగా ఎప్పుడు ఎదుగుతావ్?’’ అని అంటుంది. ‘‘ఎందుకంటే.. ఈ ప్రపంచం నిన్ను కిందకు లాగుతుంది. కాబట్టి, రైజప్ బేబీ’’ అంటుంది.
సమాజంలో ఉన్న లింగ బేధాలను బద్దలుకొట్టే మహిళగా సమంతా కనిపిస్తుంది. సగటు భారతీయ మహిళ ప్రతిరోజూ ఎదుర్కొనే పరిస్థితులను ఇందులో ప్రస్తావించారు. మహిళలు నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నిలబడాలని చెప్తూ 'రైజ్ అప్ బేబీ' అనే మాటతో యాడ్ కంప్లీట్ అవుతుంది. ఈ యాడ్ పై సమంతా స్పందిస్తూ ‘‘సమాజం మన కోసం ఏర్పరిచిన మూస పద్ధతులను బద్దలుకొడుతూ మహిళలు ఎల్లప్పుడూ వారి మనసుకు నచ్చినట్లుగా నడుచుకోవాలని గట్టిగా నమ్ముతున్నాను. ఈ యాడ్ నాకు ప్రత్యేకమైనది. మహిళల్లో ఈ యాడ్ ఆత్మవిశ్వాసం పెంపొదిస్తుందని భావిస్తున్నాను. పెప్సీతో అనుబంధం ఏర్పడినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. రేజ్ అప్, బేబీ!’’ అని పేర్కొంది.
సామ్ పెప్సీపై నెటిజన్ల తీవ్ర విమర్శలు
ఇక అమ్మడు లేటెస్ట్ పెప్సీ యాడ్ చూసి నెటిజన్లు ఓ రేంజిలో క్లాస్ తీసుకుంటున్నారు. నిన్ని మొన్నటి వరకు మయోసైటిస్ వ్యాధితో బాధపడిని ఈ అమ్మడు, ఆరోగ్యాన్ని దెబ్బ తీసే కూల్ డ్రింక్ పెప్సీని ప్రమోట్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఆమె యాడ్ వీడియోపై తీవ్ర స్థాయిలో నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అనారోగ్యకరమైన శీతల పానీయం గురించి ఎందుకు ఈ ప్రమోషన్ అంటూ మండిపడుతున్నారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా? అంటూ మరికొంత మంది బండబూతులు తిడుతున్నారు.
బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిని 'శాకుంతలం'
సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో 3డీ టెక్నాలజీలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ డిజాస్టర్ గా మారింది. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం 'అభిజ్ఞాన శాకుంతలం' లోని శకుంతల - దుష్యంతుల ప్రేమగాథ ఆధారంగా "శాకుంతలం" సినిమా తెరకెక్కించారు గుణశేఖర్. ఇందులో సమంత టైటిల్ రోల్ ప్లే చేయగా.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించాడు. అల్లు అర్జున్ కూతురు అర్హ లిటిల్ భరతుడుగా తెరంగేట్రం చేసింది. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అనన్య నాగెళ్ల, జిషు షేన్ గుప్తా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. శేఖర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ప్రస్తుతం ‘సిటాడెట్’ వెబ్ స్టోరీ ఇండియన్ వెర్షన్ లో సమంతా నటిస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి ఆమె స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. రాజ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.
Read Also: ప్రేమించిన అమ్మాయిలతో రాఖీ కట్టించుకోవడం ఏంట్రా బాబూ, ఫన్నీ ఫన్నీగా 'సామజవరగమన' టీజర్