'బొమ్మరిల్లు' ఫేమ్ సిద్ధార్థ్ సూర్యనారాయణన్ - అందాల భామ అదితి రావ్ హైదరీ జంట ఇటీవల కాలంలో సినిమాలతో కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ ఇప్పుడు ప్రేమాయణం సాగిస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తరచుగా ఇద్దరూ కలిసి తిరుగుతూ మీడియా కళ్ళకు చిక్కడం, సోషల్ మీడియాలో ఒకరికొకరు ప్రత్యేక పోస్ట్‌లు పెట్టుకోవడం, లైక్స్ చేసుకోవడం వంటివి ఈ రూమర్స్ కు ఆజ్యం పోశాయి. అయితే ఇప్పుడు తాజాగా వారి రిలేషన్ షిప్ వార్తలకు బలం చేకూర్చేలా ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
'తుమ్ తుమ్' రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 'ఎనిమీ' సినిమాలోని ఈ వెడ్డింగ్ సాంగ్ కు అనేక మంది సినీ ప్రముఖులు స్టెప్పులు వేస్తూ, రీల్స్ పోస్ట్ చేయడం మనం చూస్తున్నాం. అయితే లేటెస్టుగా అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ జంట కూడా ఈ జాబితాలో చేరిపోయారు. 'తుమ్ తుమ్' పాటకు ఇద్దరూ కలిసి అందంగా డ్యాన్స్ చేశారు. ఈ రీల్ ని అదితి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీనికి 'డ్యాన్స్ మంకీస్ - ది రీల్ డీల్' అనే క్యాప్షన్ కూడా పెట్టింది.
ప్రేమ పక్షులుగా ప్రచారంలో ఉన్న సిద్దార్థ్ - అదితి కలిసి వెడ్డింగ్ సాంగ్ కి రీల్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం జరుగుతోందనే వార్తలు నిజమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే 'తుమ్ తుమ్' రీల్ తో వారి పెళ్లికి హింట్ ఇస్తున్నారని, ఇప్పటికే పెళ్లి కూడా అయిపోయిందేమో అంటూ శుభాకాంక్షలు తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సిద్ధార్థ్, అదితి రావు కలిసి 2021లో ‘మహా సముద్రం’ అనే సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని అంటున్నారు. సినిమా ఫ్లాప్ అయినా వారి మధ్య మాంచి అనుబంధం ఏర్పడిందని.. చివరికి ప్రేమలో పడి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. ఆ మధ్య సిద్దార్థ్ ముఖానికి మాస్క్ వేసుకొని ముంబైలోని అదితి రావు ఇంటికి వెళ్లడం, ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లడం వంటివి చూసి, ఒకరినొకరు చూసుకోలేనంత గాఢ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి.
ఇదే క్రమంలో గతేడాది సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా అదితి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం.. మరోవైపు, సిద్ధార్థ్ ఆమెను హృదయపు యువరాణి అని సంబోధించడం వంటివి అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్ షోలో 'బొమ్మ పలికినట్లే ఉంది' అంటూ హీరో శర్వానంద్ సైతం సిద్దార్థ్ - అదితి రిలేషన్ షిప్ కు బలం చేకూర్చారు.
నిజానికి 'బాయ్స్' సినిమా అప్పటికే సిద్దార్థ్ కు మేఘనా అనే అమ్మాయితో పెళ్లి అయింది. కానీ నాలుగేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 'అనగనగా ఓ ధీరుడు' చిత్రం షూటింగ్ టైములో శృతి హాసన్ తో డేటింగ్ చేసినట్లుగా రూమర్స్ ఉన్నాయి. కొన్నాళ్లకు ఆమెతో బ్రేకప్ చేసుకున్న సిద్ధు.. సమంత రూత్ ప్రభుతో డేటింగ్ చేసినట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. వీరిద్దరూ కలిసి గుడిలో పూజలు కూడా నిర్వహించినట్లు కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సోహా అలీఖాన్ తో కూడా అతడు కొన్నాళ్ళు ప్రేమాయణం సాగించినట్లుగా వార్తలు వచ్చాయి.
మరోవైపు అదితి రావు హైదరీ 21 ఏళ్ల వయస్సులోనే సత్యదీప్ మిశ్రా అనే బాలీవుడ్ నటుడిని వివాహం చేసుకుంది. అయితే ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఐదేళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచీ ఒంటరి జీవితం గడుపుతోన్న ఆమెపై అనేక డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆల్రెడీ విడాకులు తీసుకున్న సిద్దార్థ్ తో రిలేషన్ షిప్ లో ఉందని టాక్ నడుస్తోంది.
తమ సంబంధం గురించి వస్తున్న కథనాలపై ఇప్పటి వరకూ ఇటు అదితి రావ్ హైదరి గానీ, అటు సిద్ధార్థ్ సూర్యనారాయణ కానీ స్పందించలేదు. కానీ వారి డేటింగ్ పుకార్ల మధ్య, వీరిద్దరూ శర్వానంద్ నిశ్చితార్థానికి జంటగా హాజరయ్యారు. అలానే ఇప్పుడు 'తుమ్ తుమ్' రీల్ తో సోషల్ మీడియాను షేక్ చేసారు. ఇందంతా గమనిస్తున్న అభిమానులు, త్వరలో వారి సంబంధాన్ని అధికారికంగా ప్రకటించాలని కోరుకుంటున్నారు. మరి త్వరలోనే సిద్ధార్థ్ - అదితి జంట ఈ రూమర్స్ కు బ్రేక్ వేస్తారేమో చూడాలి.