బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ ప్రతి రోజూ సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక విషయం మీద తన అభప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటుంది. వీలుచిక్కినప్పుడల్లా హిందీ చిత్ర పరిశ్రమను ఎండగట్టే ప్రయత్నం చేస్తూ, ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అవ్వడంతో కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయిన కంగనా.. ఖాతా తిరిగి రావడంతో మళ్లీ యాక్టివ్ అయిపోయింది. ఎప్పటిలాగే బాలీవుడ్ మీద విరుచుకుపడుతోంది.
ఇటీవల కంగనా పొలంలో పని చేస్తున్న తన తల్లి ఫోటోని షేర్ చేసి, ఆమె వ్యక్తిత్వాన్ని కొనియాడింది. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ.. “కంగనా మిలీనియర్ అయినా ఆమె తల్లి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు.. హౌ గ్రేట్” అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ కి కంగనా స్పందిస్తూ.. "దయచేసి ఓ విషయం గమనించండి. నా సంపాదన వల్ల నా తల్లి ధనవంతురాలు కాదు. నేను పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. కానీ మా అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్ గా పని చేసింది" అని పేర్కొంది. పనిలో పనిగా బాలీవుడ్ పై విరుచుకుపడింది.
సినిమా మాఫియాపై నేను రియాక్ట్ అయ్యే యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకోవాలి. నేను వారిలాగా పెళ్లిల్లో చవకబారు వస్తువులు ధరించను. అలాగే వారిలా పెళ్లిల్లో చీప్ గా డ్యాన్స్ చేయలేను అని కంగనా రనౌత్ పేర్కొంది. సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను వెల్లడిస్తూ.. ఓ వర్గాన్ని ఉద్దేశించి 'భిఖారీ సినీ మాఫియా' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
‘‘నేను ఇతర అమ్మాయిల మాదిరిగా కబుర్లు చెప్పను. అందుకే చాలా మంది వ్యక్తులు నన్ను అహంకారి అని పిలిచారు. పెళ్లిళ్లలో ఐటమ్ డ్యాన్స్ లు చేయడానికి అంగీకరించను. అలానే రాత్రిపూట నన్ను కోరుకున్న ఏ హీరో రూమ్ కి వెళ్లడానికి కూడా నేను ఇష్టపడలేదు. కాబట్టే వారు నన్ను ఒక పిచ్చిదానిగా ముద్ర వేసి, జైల్లో పెట్టడానికి ప్రయత్నించారు’’ అని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.
‘‘ఆత్మగౌరవంతో ఎవరి సహాయం లేకుండా పరిశ్రమలో తనదైన మార్గాన్ని ఏర్పరచుకున్నానని, హిందీ చిత్ర పరిశ్రమలోని కొందరి ఆదేశాలను పాటించడానికి నిరాకరించినందున తనను పక్కన పెట్టారని కంగనా ఆరోపించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సైతం ‘చెత్త మూవీ మాఫియా చిల్లర డబ్బు కోసం ఛీప్ గా పెళ్లిలో డ్యాన్సులు చేస్తుంటుంది. అలాంటి వారికి నిజమైన వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం అంటే ఏంటో తెలియదు. నేను అలాంటి వారికి ఎప్పటికీ గౌరవం ఇవ్వను’’ అని పేర్కొంది కంగనా.
ఇక సినిమాల విషయానికొస్తే, కంగనా రనౌత్ ఇటీవలే తన స్వీయ దర్శకత్వం వహిస్తున్న ‘ఎమర్జెన్సీ’ మూవీ షూటింగ్ ను ముగించింది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం రాఘవ లారెన్స్ తో కలిసి "చంద్రముఖి 2" చిత్రంలో నటిస్తోంది. 'తేజస్', 'సీత: ది ఇన్కర్నేషన్' వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ కూడా ఆమె లైనప్ లో ఉన్నాయి.