పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. పురాణ ఇతిహాస గ్రంథమైన రామాయణం ఆధారంగా ఆయన చేసిన సినిమా 'ఆదిపురుష్'. ప్రభు శ్రీరామచంద్రుడి పాత్రలో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. అయితే, జూన్ 13న ట్రిబెకా చలన చిత్రోత్సవాల్లో ప్రీమియర్ వేయడానికి సన్నాహాలు చేశారు. దాంతో విడుదలకు రెండు రోజుల ముందు టాక్ తెలుసుకోవచ్చని ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే, ఇప్పుడు ఆ అవకాశం లేదు. 


ట్రిబెకాలో ప్రీమియర్ క్యాన్సిల్!
ట్రిబెకా చలన చిత్రోత్సవాల్లో జూన్ 13న 'ఆదిపురుష్' ప్రీమియర్ షో వేయడం లేదు. జూన్ 15న సాయంత్రం ఎనిమిది గంటలకు వేస్తున్నారు. ఆ తర్వాత జూన్ 17న మధ్యాహ్నం 12 గంటలకు మరో షో వేస్తున్నారు. నిజం చెప్పాలంటే... అమెరికాలో తెలుగు సినిమా ప్రీమియర్ షోలు అంత కంటే ముందు పడతాయి. 


ప్రీమియర్ ఎందుకు క్యాన్సిల్ చేశారు?
ఎర్లీ టాక్ వస్తుందని భయపడుతున్నారా?
ఇప్పుడు జూన్ 13న వేయాల్సిన 'ఆదిపురుష్' ప్రీమియర్ షోలు ఎందుకు క్యాన్సిల్ చేశారు? అనే చర్చ జరుగుతోంది. రెండు రోజులు ముందుగా షో వేస్తే... ఎర్లీగా రివ్యూస్ వచ్చేస్తాయి. వాటిని కంట్రోల్ చేయడం కష్టం. ఒకవేళ నెగిటివ్ రివ్యూలు వస్తే ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుంది. అందుకని, క్యాన్సిల్ చేశారా? లేదంటే మరొక కారణం ఉందా? అనే చర్చ జరుగుతోంది. 


'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత వచ్చిన ట్రోల్స్ మరొక సినిమాకు రాలేదని చెప్పవచ్చు. ప్రభాస్ వీరాభిమానులకు కూడా ఆ టీజర్ నచ్చలేదు. అయితే, ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్రాఫిక్స్ బావున్నాయని పేరు వచ్చింది. విజువల్స్ ఎఫెక్ట్స్ మీద టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా మంది నోటీస్ చేశారు. కానీ, ఇప్పుడు ప్రీమియర్స్ క్యాన్సిల్ కావడంతో మరోసారి సినిమా మీద అనుమానాలు కలుగుతున్నాయని సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు. 


Also Read : పూరి జగన్నాథ్ హర్టు - ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇచ్చేది లేదట!



'ఆదిపురుష్' చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ జోడీగా, జానకి అలియాస్ సీత దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. రావణ బ్రహ్మ, లంకేశుని పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆల్రెడీ సినిమా నుంచి రెండు సాంగ్స్ టీజర్స్ విడుదల చేశారు. ఆ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అజయ్ అతుల్ స్వరపరిచిన పాటలే కాదు... ట్రైలర్ లో నేపథ్య సంగీతానికి కూడా మంచి పేరు వచ్చింది.  


టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రమిది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందోనని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. 


Also Read గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ కథతో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'?