'లైగర్' డిజాస్టర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆ సినిమా ఎగ్జిబిటర్లు, బయ్యర్లు ధర్నాకు దిగడంతో చిత్రసీమ ప్రముఖులతో పాటు సగటు ప్రేక్షకుల చూపు కూడా అటు పడింది. గత ఏడాది ఆగస్టు 25న సినిమా విడుదల అయితే... ఇప్పుడు ధర్నాకు దిగడం వెనుక కారణాలు ఏమిటి? అని ఆలోచిస్తే 'డబుల్ ఇస్మార్ట్' కళ్ళ ముందు మెదులుతుంది. 


పూరి కొత్త సినిమా ప్రకటనకు ముందు!
'లైగర్' విడుదలైన తర్వాత రిజల్ట్ ఏమిటనేది పరిశ్రమకు, ప్రేక్షకులు అందరికీ అర్థమైంది. డిజాస్టర్ అని క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత బయ్యర్లు, ఎగ్జిబిటర్లు తమ నష్టాలను భర్తీ చేయాలంటూ పూరి జగన్నాథ్ ముందుకు వచ్చారు. అప్పట్లో కొన్ని చర్చలు జరిగాయి. పోలీస్ కేసుల వరకు వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు ధర్నాకు దిగడం ఏమిటి? అంటే... పూరి జగన్నాథ్ కొత్త సినిమా ప్రకటన వస్తుంది కనుక!


'లైగర్' డిజాస్టర్ తర్వాత పూరికి మరో అవకాశం రావడం కష్టం అని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు భావించాయి. ఇటువంటి తరుణంలో రామ్ పోతినేని హీరోగా సూపర్ డూపర్ హిట్ 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' ప్రకటన వచ్చింది. అది కన్ఫర్మ్ అయ్యిందని పక్కా సమాచారంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగారని ఫిల్మ్ నగర్ ఖబర్. 


నిజం చెప్పాలంటే... 'లైగర్' మీద కోట్లకు కోట్ల రూపాయలు పెట్టడానికి కారణం కూడా 'ఇస్మార్ట్ శంకరే'. అసలు ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ హీరోగా పూరి తీసిన 'లైగర్' మీద అంచనాలు పెరిగాయి. 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్ వస్తుండటంతో ఆ సినిమా రైట్స్ కోసం ఇప్పుడీ ధర్నా అనేది టాక్. 


హర్ట్ అయిన పూరి...
ఒక్క రూపాయి ఇచ్చేది లేదు!
తన ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగడంతో పూరి జగన్నాథ్ హర్ట్ అయినట్లు తెలిసింది. ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి ఇచ్చేది లేదని ఇరు వర్గాల మధ్య రాయబారానికి ప్రయత్నించిన పెద్దలతో చాలా స్పష్టంగా చెప్పేశారని సమాచారం అందింది. గతంలో కూడా ఆయన ఆ మాట చెప్పిన సంగతి తెలిసిందే. అగ్రిమెంట్స్ ప్రకారం కూడా పూరికి, బయ్యర్లు & ఎగ్జిబిటర్లకు మధ్య ఎటువంటి సంబంధం లేదట!


భారీగా నష్టపోయిన వరంగల్ శ్రీను!?
'లైగర్' డిజాస్టర్ కావడంతో అందరి కంటే ఎక్కువగా నష్టపోయినది తానేనని సౌత్ ఇండియా రైట్స్ కొన్న వరంగల్ శ్రీను చెబుతున్నారు. అసలు బలిపశువు తాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సుమారు 60 కోట్ల రూపాయలకు తాను సినిమా రైట్స్ కొన్నానని, డిజాస్టర్ టాక్ రావడంతో ఎగ్జిబిటర్లు ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కి తీసుకున్నారని, అందరి కంటే ఎక్కువ డబ్బులు తనవే పోయాయనేది వరంగల్ శ్రీను వాదన. 


విజయ్ దేవరకొండకు కూడా డబ్బులు ఇవ్వలేదా?
'లైగర్' సినిమాకు గాను హీరో విజయ్ దేవరకొండకు కూడా ముందుగా అనుకున్న రెమ్యూనరేషన్ అందలేదని సమాచారం. కేవలం 25 శాతం మాత్రమే ఇచ్చారట. ఈ విషయం తెలిసి ఆయన్ను బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఏమీ అనడం లేదని టాక్. గతంలో 'ఆచార్య' ఫ్లాప్ అయినప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ తమ రెమ్యూనరేషన్స్ వెనక్కి ఇచ్చిన సంగతి తెలిసిందే. ధర్నా చేస్తున్న వాళ్ళకు ప్రముఖ నిర్మాత, నైజాంలో పట్టున్న డిస్ట్రిబ్యూటర్ మద్దతు పలకడంతో ఈ వ్యవహారం ఎటు వైపు వెళుతుందోనని ఇండస్ట్రీ ఆసక్తిగా గమనిస్తోంది.


Also Read గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ కథతో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'?