Adipurush's Kumbhkarna Lavi Pajni : 'ఆదిపురుష్' విడుదలైనప్పట్నుంచి ఏదో విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంది. వివాదాలు, నెగెటివ్ కామెంట్స్ నడుమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటొన్న ఆదిపురుష్ కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్రలో నటించిన నటుడు లవి పజ్ని కూడా సినిమాలో చూపించిన సంభాషణలపై నిరాశ వ్యక్తం చేశారు. సినిమా నాన్‌లీనియర్‌లో చిత్రీకరించబడినందున, నటీనటులకు ఖచ్చితమైన స్క్రీన్‌ప్లే లేదా స్క్రీన్‌పై ఎలా చూపిస్తారనేది తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.


లవి పజ్నిమీడియాతో మాట్లాడుతూ.. "డైలాగ్‌లకు సంబంధించినంత వరకు, అందరిలాగే, నేను కూడా హిందువునే కాబట్టి.. నేను కూడా వారితో పాటు తీవ్ర మనస్తాపం చెందాను" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. "దర్శకుడు ఏది చెబితే అది మనం చేయాలి. మేం అప్పటికే మూవీపై ఒప్పందం చేసుకున్నాం. కాబట్టి చేయక తప్పలేదు. ఫైనల్ స్క్రీన్‌ప్లే ఏమిటో కూడా ఎవరికీ తెలియదు" అని లవి చెప్పారు.


'ఆదిపురుష్'లో తాను నటించినప్పటికీ కొన్ని విషయాలు తనకు కూడా నచ్చలేదని లవి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి, ఆ మూవీలో నటించిన నటులకే ఆ సినిమా నచ్చలేదంట.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రామాయణాన్ని అపహాస్యం చేశారనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు.


ప్రాముఖ్యత ఉన్న పాత్రకు నిడివి తక్కువ..


రామాయణంలో కుంభకర్ణ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కుంభకర్ణుడు ఒక అసాధారణమైన వీరుడుగా కనిపిస్తాడు. భారీ కాయంతో యుద్ధ భూమిలో అందర్నీ భయపెడుతూ ఉంటాడు. రాముడు ఎంతో కష్టపడి కుంభకర్ణుడిని పడగొడతాడు. కానీ 'ఆదిపురుష్' సినిమాలో మాత్రం అసలు ఈ పాత్రకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. సినిమా మొత్తంలో కనీసం ఒక 5 నిముషాలు కూడా కనిపించడంటూ కామెంట్ చేస్తున్నారు. సినిమాలో కుంభకర్ణుడు నిద్రలేచి వచ్చి హనుమంతుడితో ఫైట్ చేసి, రాముడు బాణాలు వేయగానే పడిపోతాడు... ఈ క్యారెక్టర్ చాలా సింపుల్ గా ఉంటుందంటూ విమర్శలు కూడా వచ్చాయి.


ఆదిపురుష్ ఎఫెక్ట్ తో రామాయణ సీరియల్ రీ టెలికాస్ట్..


'ఆదిపురుష్' పై దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సినిమాలోని డైలాగులు, సన్నివేశాలు అభ్యంతరకరంగా, రామాయణాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయంటూ ఆడియెన్స్ ఆరోపణలు చేశారు. ఇటీవలే ఈ సినిమాలోని డైలాగులపై అలహాబాద్ కోర్టు కూడా సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆదిపురుష్ మూవీ తీవ్ర వివాదాస్పదంగా మారడంతో మరో వార్త కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. రామానంద సాగర్ దర్శకత్వంలో బాలీవుడ్ లో తెరకెక్కిన రామాయణం సీరియల్ ను మళ్లీ రీ టెలికాస్ట్ కు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. అప్పట్లోనే లిమ్కా బుక్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించిన ఈ సీరియల్ ను చూసి ఆదిపురుష్ టీం చాలా నేర్చుకోవాలంటూ బాలీవుడ్ నెటిజన్లు ఆదిపురుష్ ని ట్రోల్ చేయడం అందరికీ తెలిసిందే.


Read Also : Jr NTR’sbag: ఎయిర్ పోర్టులో లూయిస్ విట్టన్ బ్యాగ్‌తో కనిపించిన ఎన్టీఆర్, దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial