Tamannaah's Remuneration for Odela 2: హీరోయిన్ తమన్నా హవా ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. కొంత కాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు తమన్నా. ఆ మధ్యలో ఆమె నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో కెరీర్ కాస్త డల్ అయింది. చాలా కాలం తర్వాత ‘జైలర్’, ‘స్త్రీ 2’ లోని ఐటెం సాంగ్స్ ఆమె కెరీర్ మళ్లీ ఊపందుకుంది. తాజాగా ఆమె ఓ సినిమా కోసం రూ 2 కోట్లు తీసుకుంటున్నారని టాక్. 2022 లో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు సీక్వెల్ గా ‘ఓదెల 2’ రానుంది. మొదటి భాగం నేరుగా ఓటీటీలోనే విడుదలై, మంచి విజయం సాధించింది. మర్డర్ మిస్టరీ గా రూపొందిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు కథ అందించిన దర్శకుడు సంపత్ నంది ఈ సీక్వెల్ ను కూడా రచించారు. ఈ సారి సీక్వెల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో రానుంది. ఇందులో శివ శక్తి అనే పాత్రలో నాగసాధువుగా నటిస్తున్నారు తమన్నా. సంపత్ నంది నిర్మాణంలోనే అశోక్ తేజ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ఓదెల రైల్వే స్టేషన్ ’ సినిమాలో నటించిన హెబ్బా పటేల్ సీక్వెల్ లో ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సీక్వెల్ కు ‘కాంతారా’, ‘మంగళవారం’ ఫేమ్ బి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.
‘ఓదెల 2’ పైనే ఆశలు!
తొలి సినిమా ‘హ్యాపీ డేస్’ తర్వాత తమన్నా, స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, చిరంజీవి, రజినీకాంత్, విజయ్ ప్రభాస్ వంటి స్టార్లతో వరుస సినిమాలు చేశారు. స్టార్ హీరోయిన్ అయ్యారు. అయితే, ‘బాహుబలి’ సినిమాలు తమన్నాకు పాన్ ఇండియా గుర్తింపు తెచ్చి పెట్టాయి. తమన్నా పాన్ ఇండియా స్టార్ అవుతారని అంతా భావించారు. కానీ తర్వాతి కాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కేవలం ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. మిగతావేవీ ఆమె కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఆ మధ్య కాలంలో నితిన్ హీరోగా నటించిన ‘మేస్ట్రో’ అనే రీమేక్ సినిమాలో కీలక పాత్ర కూడా చేశారు. అదీ ఫ్లాప్ అయింది.
‘లస్ట్ స్టోరీస్ 2’ అనే నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ లో ఓ ఎపిసోడ్ లో నటించారు తమన్నా. అయితే ఓటీటీ ఎంట్రీ కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. తమన్నా ‘జైలర్’ లో ‘రా... నువ్ కావాలయ్యా’ పాటతో ఒక్క సారిగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత, హిందీ సినిమా ‘స్త్రీ 2’ సినిమాలో ‘‘ఆజ్ కి రాత్ ...’’ అంటూ ఫ్యాన్స్ కు కిక్ ఎక్కించారు. ఈ మధ్యే ‘సికిందర్ కా ముఖాదర్’ అనే హిందీ సినిమా చేశారు. జాన్ అబ్రహం తాజా సినిమా ‘వేదా’ లోనూ తమన్నా చాలా కొద్ది సేపే కనిపిస్తారు. బేబీ ఫేమ్ నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఫ్లాప్ అయింది కూడా. ప్రస్తుతం తమన్నా చేతిలో ‘ఓదెల 2’ మాత్రమే ఉంది. తొలి సారిగా ఈ సినిమాలో ఆమె ఓ డీ గ్లామరస్ రోల్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘ఓదెల 2’ పైనే ఆమె ఆశలు పెట్టుకున్నారు.