Shraddha Srinath Interview: ఈ సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ తర్వాత వచ్చే పెద్ద చిత్రం ‘డాకు మహారాజ్’. నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా.. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ముఖ్యంగా థమన్ మరోసారి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశాడనేలా ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌కి తిరుపతి తొక్కిసలాట ఘటన బ్రేక్ వేసింది. గురువారం అనంతపూర్‌లో జరగాల్సిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సడెన్‌గా తిరుపతిలో జరిగిన ఘటనతో యూనిట్ క్యాన్సిల్ చేసింది. మరోవైపు చిత్రంలో నటించిన వారితో ఇంటర్వ్యూలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్.. ‘డాకు మహారాజ్’ విశేషాలను మీడియాతో పంచుకుంది. ఆమె ఈ సినిమా గురించి ఏం చెప్పిందంటే..
‘‘నేను ఇప్పటివరకు కొన్ని విభిన్న సినిమాలు చేశాను కానీ, ఈ చిత్రం మాత్రం ఒక పూర్తి ప్యాకేజ్‌లా ఉంటుంది. ఇలాంటి సినిమా నేను ఇప్పటి వరకు చేయలేదు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ప్రేక్షకులకు కావాల్సినవన్నీ ఇందులో ఉంటాయి. అందులోనూ బాలకృష్ణగారి సినిమా అంటే.. ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ ఉంటుంది కాబట్టి.. ఇందులో నా ప్రతిభ కూడా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుంది. బాలకృష్ణగారి గురించి చెప్పాలంటే.. ఆయనకు ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఈసుమంత అహం కూడా ఆయనలో నాకు కనిపించలేదు. సినిమా సెట్స్‌లో అందరితో సరదాగా ఉంటారు. చిన్న, పెద్ద అనే తేడాలు ఆయనకు లేవు. దర్శకులకి ఆయన ఇచ్చే గౌరవం చూస్తుంటే ఎంతో నేర్చుకోవచ్చు. ఒక్కసారి సెట్‌లోకి వచ్చాక దర్శకుడు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
ఈ సినిమాలో నా పాత్ర పేరు నందిని. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. చాలా ఓపిక ఎక్కువ. ఎలా పడితే అలా మాట్లాడే టైప్ కాదు.. ఎప్పుడు, ఎక్కడ, ఎట్టా మాట్లాడాలో స్పష్టంగా తెలిసిన అమ్మాయి. నా పాత్రలో ఎంతో డెప్త్ ఉంటుంది. నటనకు కూడా ఎంతో ఆస్కారమున్న పాత్ర. అందుకే నా నందిని పాత్రపై ఎంతో నమ్మకంగా ఉన్నా. నందిని పాత్రతో ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాననే నమ్మకం ఉంది. నటిగా ఈ సినిమాతో ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ అద్భుతంగా కుదిరాయి. డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాను. ప్రతి డైలాగ్ మీద ఎంతో కేర్ తీసుకొని డబ్బింగ్ చెప్పించారు. దర్శకుడు బాబీ ఎంతో ప్రతిభ గల దర్శకుడు. సినిమా పట్ల ఆయనకు ఎంతో ప్యాషన్ ఉంది. దర్శకుడే కాదు.. ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నాడు. ప్రతి సీన్ ఆయన యాక్ట్ చేసి మరీ చూపించేవాడు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాకు ‘జెర్సీ’ వంటి మెమరబుల్ ఫిల్మ్‌ని ఇచ్చింది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’లో మరో మంచి పాత్ర ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి బ్యానర్‌లో సినిమా చేయడం ఎప్పుడూ గౌరవంగానే భావిస్తాను. ఈ బ్యానర్‌లో చేసిన ‘జెర్సీ’, ‘డాకు మహారాజ్’ రెండూ వేటికవే ప్రత్యేకం. ‘జెర్సీ’లో నేను పోషించిన సారా పాత్ర నా మనసుకి బాగా నచ్చిన పాత్ర. ప్రేక్షకులు కూడా ఎంతో ఆదరించారు. ఇప్పుడు ఇందులోని నందిని పాత్ర కూడా ప్రేక్షకులకు ఆ స్థాయిలో చేరువ అవుతుందనే నమ్మకం ఉంది. భవిష్యత్‌లో కూడా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండే పాత్రలు పోషించమంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్రల కోసం వేచి చూస్తున్నాను..’’ అని తెలిపింది శ్రద్ధా శ్రీనాథ్.
Also Read: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?