సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో, అంతే చెడు కూడా జరుగుతుంది. సెలబ్రిటీలపై చేతికి ఏది వస్తే అది టైప్ చేసి, వాళ్లను మానసికంగా బాధపెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అయితే ఈ తరం హీరోయిన్లు ఇలాంటి విషయాల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ హనీ రోజ్ తనను వేధిస్తున్న వాళ్లపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా, తాజాగా ఈ లిస్టులో మరో హీరోయిన్ నిధి అగర్వాల్ చేరిపోయింది.
సైబర్ క్రైమ్ కు నిధి అగర్వాల్ కంప్లైంట్...
కెరీర్ పరంగా నిధి అగర్వాల్ కు ఈ ఏడాది చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆమె రెబల్ స్టార్ ప్రభాస్ తో 'రాజా సాబ్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తోంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి 'హరిహర వీరమల్లు' అనే భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో భాగం కాబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడు అంటూ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ లో సదరు వ్యక్తి తనను చంపేస్తానని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నాడంటూ నిధి పేర్కొంది. అంతేకాకుండా ఆ వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని కూడా బెదిరిస్తున్నాడని పోలీసులకు తెలిపింది. ఈ బెదిరింపుల వల్ల తాను మానసిక ఒత్తిడికి గురవుతున్నాను అంటూ సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన కంప్లైంట్ కోరినట్టు సమాచారం. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ ఇచ్చిన కంప్లైంట్ పై విచారణ చేపట్టారు.
హనీ రోజ్ కూ ఇలాంటి వేధింపులే....
రెండు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా తనను ఓ వ్యాపారవేత్త వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ మలయాళ బ్యూటీ హనీ రోజ్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె కొద్ది రోజుల క్రితమే పోలీసులకు కంప్లైంట్ చేయగా, దాదాపు 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసులో కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేసి అతనికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. హనీని ఇబ్బంది పెట్టిన ఆ ప్రముఖ వ్యాపారవేత్త పేరు బాబి చెమ్మనూరు. అతడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు. ఇతడిపై కంప్లైంట్ నమోదైన రోజు నుంచే పరారీలో ఉన్నాడు. ఇక అతనిపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ అంశంపై హనీ రోజ్ ముఖ్యమంత్రి పినరై విజయన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారని వెల్లడించింది. మొత్తానికి అతడిని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ తో పోస్టులు పెడుతున్నారని, తనను అవమానించేలా కామెంట్స్ చేస్తున్నాడని ఇన్స్టా వేదికగా వెల్లడించింది. మొత్తానికి అతను అరెస్ట్ కావడంతో తను ప్రశాంతంగా ఉన్నానని హనీ రోజ్ చెప్పింది. ఇక ఇప్పుడు నిధి అగర్వాల్ ను వేధించిన వారిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.