Actress Lathasri About Her Cine career: తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది సీనియర్ నటి లతాశ్రీ. తెలుగు, కన్నడ సినిమా పరిశ్రమల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత నటనా రంగానికి దూరం అయ్యింది. నాగ శౌర్యకు మేనత్త అయిన లతాశ్రీ అసలు పేరు పద్మలత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినీ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలను వెల్లడించింది.  


సినిమా పరిశ్రమలోకి రావాడానికి కారణం అమ్మ!


అమ్మ పోత్సాహంతోనే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినట్టు సీనియర్ నటి లతాశ్రీ చెప్పింది. “మా తాత సూరపనేని ప్రభాకర్ రావు డ్రామా ఆర్టిస్టు. మా అమ్మకు నటన పట్ల చాలా ఇష్టం ఉండేది. తను నాలో నటిని చూడాలి అనుకునేది. చిన్నప్పుడు నేను డ్యాన్స్ నేర్చుకున్నాను. తరచుగా ప్రోగ్రామ్స్ లో డ్యాన్సులు చేసేదాన్ని. నన్ను ఎలాగైనా ఇండస్ట్రీలోకి తీసుకురావాలి అనుకున్నది. తీసుకొచ్చింది. నాన్నకు నేను సినిమాల్లోకి రావడం పెద్దగా ఇష్టం లేదు. నాక్కూడా చిన్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండేది కాదు. అందుకే నేను కూడా సినిమాల్లోకి రావాలి అనుకున్నాను. నేను 10వ తరగతిలో ఉండగానే పెళ్లి సంబంధాలు వచ్చేవి. నాకు చదువు మీద పెద్దగా ఆసక్తిలేదు. అందుకే పెళ్లి నుంచి తప్పించుకునేందుకు ఇండస్ట్రీలోకి వచ్చాను. ఓవైపు పెద్ద సినిమాలు చేస్తూనే, మరోవైపు చిన్న పాత్రలకు కూడా చేసే దాన్ని. సినిమాల విషయంలో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగేది. నాకు నచ్చే సినిమాలు తను ఒప్పుకునేది కాదు. కొద్ది రోజుల పాటు అలా జరిగింది. కానీ, ఆ తర్వాత మంచి క్యారెక్టర్లు చేశాను. కొన్ని కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా చేశాను. తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అమ్మ చెప్పేది. అందుకే, తెలుగులో ఎక్కువ సినిమాలు చేశాను.


సూపర్ స్టార్ కృష్ణతో సినిమాలు చేస్తాను అనుకోలేదు!


సూపర్ స్టార్ కృష్ణకు తాను పెద్ద అభిమానినని లతాశ్రీ తెలిపింది. ఆయనతో కలిసి సినిమాలు చేస్తానని అస్సలు ఊహించలేదన్నది. “ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో చాలా క్యారెక్టర్లు చేశాను. చాలా మంది ఒక సినిమా చేశాక, అదే దర్శకుడు మరో సినిమా చేసే సమయంలో మాకు ఏమైనా క్యారెక్టర్ ఉందా? అని అడిగేవారు. నేను మాత్రం అడిగేదాన్ని కాదు. ఓసారి ఇదే విషయాన్ని ఈవీవీ గారు పిలిచి అడిగారు. ఎందుకు నువ్వు క్యారెక్టర్లు కావాలని అడగవు? పొగరు అనుకోవాలా? అన్నారు. అలా కాదండీ.. ఆ క్యారెక్టర్ కు నేను సరిపోతాను అంటే మీరు అవకాశం ఇస్తారనే నేను అడగను అని చెప్పాను. అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమాకు నన్ను అడిగేవారు. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు ఎక్కువగా చేశాను. నేను చిన్నప్పుడు కృష్ణ గారి ఫ్యాన్. ఆయనతో కలిసి సినిమాలు చేస్తానని అనుకోలేదు. ఆయనతో కలిసి ‘నెంబర్ 1’ సినిమాలో తొలిసారి నటించాను. ఆ తర్వాత చాలా సినిమాల్లో చేశాను. ఆయనతో సినిమాలు చేస్తే చాలా కంఫర్ట్ అనిపించేది. చాలా మంది నిర్మాతలు సినిమాలకు డబ్బులు ఎగ్గొట్టారు” అంటూ లతాశ్రీ తెలిపింది.


Also Read: ఆ సినిమా షూటింగ్ సమయంలో బాత్రూమ్స్ లేవు, అలా చేయాల్సి వచ్చింది - ప్రియమణి