Sree Vishnu about HanuMan Movie: తమ సినిమాలు కమర్షియల్‌గా హిట్స్ అందుకున్నా లేకపోయినా.. కచ్చితంగా డిఫరెంట్ కథల్లోనే నటించాలి అనుకునే టాలీవుడ్ హీరోలు కొందరు ఉన్నారు. అందులో శ్రీ విష్ణు కూడా ఒకరు. కామెడీ, కమర్షియల్ కథలతో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తూనే రిఫ్రెషింగ్ కథలను ఎంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ హీరో. అదే తరహాలో 'ఓం భీమ్ బుష్'తో మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే తన మార్కెట్‌ను పెంచుకోదగ్గ హిట్స్ శ్రీ విష్ణుకు ఉన్నా కూడా పాన్ ఇండియా చిత్రాలవైపు ఎందుకు వెళ్లడం లేదో బయటపెట్టాడు. కొత్త హీరోలు పాన్ ఇండియా సినిమాలు అంటూ వెళ్లిపోవడంపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
రివ్యూలు బాగా చెప్తాను..
‘‘ఎవరిలాగానో మనం కూడా అయిపోవాలి అనుకుంటే ముందుకు వెళ్లలేం. నీ దారిలో నువ్వు వెళ్లు అనుకుంటాను నేను. చెప్తే నమ్మరు కానీ నేను ఏ సినిమా హిట్ అయినా సెలబ్రేట్ చేసుకుంటాను. సినిమా చూస్తే సోషల్ మీడియాలో ఎక్కడా పోస్ట్ చేయను కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్న డైరెక్టర్స్‌ను పిలిచి ఎంజాయ్ చేస్తాను. పెద్ద హీరోలదే కాదు ఎవరి సినిమా హిట్ అయినా అంతే. షూటింగ్ ఉంటే తర్వాత రోజు అయినా మూవీ చూస్తాను. ముందు నుంచి అయినా నేను రివ్యూలు చాలా బాగా చెప్తాను. నన్ను చాలామంది రివ్యూలు అడిగేవారు. సినిమా చూడగానే బాగుందంటూ అటు నుంచి అటే వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకవేళ బాలేకపోయినా ఎందుకిలా జరిగింది అని చర్చించుకుంటాం’’ అంటూ ఇటీవల కాలంలో తనకు బాగా నచ్చిన మూవీ ‘హనుమాన్’ అంటూ ఆ సినిమాపై వ్యాఖ్యలు చేశాడు శ్రీ విష్ణు.
వండర్స్ క్రియేట్ చేస్తాడు..
‘‘హనుమాన్‌లో సూపర్ హీరో కాన్సెప్ట్ అనేది హనుమంతుడిపై చేయడం బాగా నచ్చింది. అంత తక్కువ బడ్జెట్‌లో అలా చూపించేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ప్రశాంత్, తేజ నాకు బాగా పరిచయం. వాళ్లిద్దరి విషయంలో నేను చాలా హ్యాపీ. అబ్బా, బాగా కొట్టారు అనిపించింది. సిక్స్ కొడితే ఊరు దాటి వెళ్లిపోయింది’’ అంటూ ‘హనుమాన్’పై ప్రశంసలు కురిపించాడు శ్రీ విష్ణు. ఇక కొత్త డైరెక్టర్లలో తనకు బాగా నచ్చింది ఎవరు అని అడగగా.. ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్ గోలి పేరు చెప్పాడు. ‘‘నేను వర్క్ చేసిన వాళ్లలో నాకు తెలిసి హసిత్ వండర్స్ క్రియేట్ చేస్తాడు’’ అని నమ్మకం వ్యక్తం చేశాడు.
టైమ్ వేస్ట్..
సందీప్ రెడ్డి వంగా, వివేక్ ఆత్రేయ, తరుణ్ భాస్కర్, వెంకటేశ్ మహా, ప్రశాంత్ నీల్.. ఈ దర్శకుల పనితీరు తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు. ఇక తను సోషల్ మీడియాలో తను ఎక్కువగా యాక్టివ్‌గా ఉండకపోవడం వెనుక కారణాన్ని బయటపెట్టాడు. ‘‘సినిమా అయిపోయిన తర్వాత కనిపించి చూసేవాళ్ల టైమ్ వేస్ట్ చేయడం ఎందుకు అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇది తిన్నాను, ఇది తాగాను.. అని అవన్నీ ఎందుకు? అయినా ఎవరి ఇష్టం వాళ్లది. ఒక్కొక్కసారి నాకు కూడా హ్యాపీగా ఉన్న మూమెంట్స్‌ను అలా పెట్టాలని అనిపిస్తుంది. ఎవరి పర్సనల్ వాళ్లది. నేను వేరేవాళ్లను ఏమనట్లేదు’’ అని తెలిపాడు శ్రీ విష్ణు.
Also Read: ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో అల్లు అర్జున్ - ఇదంతా 'పుష్ప 2' కోసమేనా?