కృతిశెట్టి... ‘ఉప్పెన’ సినిమాతో తొలిసారిగా తెలుగు తెరపై కనిపించింది. మొదటి సినిమాతోనే చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఆమె తాజాగా హైదరాబాద్ లోని దేవ్ నార్ పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులతో మాట్లాడారు. ఎటువంటి కల్మషం లేని దేవ దూతల్లాంటి చిన్నారులను కలిశానని.. కృతిశెట్టి తన ఇన్ స్టా వేదికగా తెలుపుతూ.. ఫోటోలను షేర్ చేసింది.  ఫౌండేషన్ స్థాపించి, పిల్లల కోసం పాటుపడుతున్న డాక్టర్ సాయిబాబా గౌడ్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యనించింది కృతి. అంతేకాదు అక్కడి చిన్నారుల నుంచి ఎంతో  నేర్చుకోవచ్చని పేర్కొంది.


దేవ్ నార్ అంటే ప్రత్యేకమైన అర్థం ఉంది. దేవ్ అంటే దేవుడు, నార్ అంటే మనిషి. దేవ్ నార్ అనేది రెండు పదాల కలయిక. దీని అర్థం ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడని. ఇదే ఈ పాఠశాల ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. యావత్ ప్రపంచం అంతా భగవంతుడి సృష్టించినదే. అయితే వారిలో దృష్టిలోపం ఉన్న వారు, అంథులు ప్రత్యేకమైన వారు. అందువలన ఆ చిన్నారుల సామర్థ్యాన్ని, ప్రతిభను పెంపొందించుకోవడానికి వారికి ఒక అవకాశం ఇవ్వాలి. ఇందుకు ఒక వేదిక కావాలి అదే దేవ్ నార్ స్కూల్.


అక్కడి ఉపాధ్యాయులు దేవ్ నార్ ఫౌండేషన్ లో అంధ విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా వారి సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తారు. దాని వలన పిల్లల్లోని నైపుణ్యం, జ్ఞానంతో పాటు ఏవైనా ప్రత్యేకతలు ఉంటే వాటిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు వారు విజయపథంలో దూసుకువెళ్లేలా ప్రోత్సహిస్తారు. దేవ్ నార్ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు బోర్డిండ్, బస పూర్తి ఉచితంగా అందిస్తారు నిర్వాహకులు. సంవత్సరంలో ఏ సమయంలోనైనా దృష్టి లోపం ఉన్న చిన్నారులను చేర్చుకోవడం ఈ స్కూల్ ప్రత్యేకత.


కాగా దేవ్ నార్ ఫౌండేషన్ ను 1991వ సంవత్సరంలో ప్రారంభించారు. ఆ సమయంలో ఒక అద్దె గదిలో కేవలం నలుగురు విద్యార్థులతో ఈ ఫౌండేషన్ కు పునాది పడిందని చెప్పొచ్చు. అతి తక్కువ కాల వ్యవధిలోనే ఈ ఫౌండేషన్ అభివృద్ధి చెందింది. ఇప్పుడు మూడు అంతస్తుల భవనంలో సుమారు 5 వందల యాభై మంది విద్యార్థులతో ఉంది.






దేవ్‌నార్ పాఠశాలను డాక్టర్ ఎ. సాయిబాబా గౌడ్ స్థాపించారు. ఆయన భారతదేశానికి చెందిన ప్రముఖమైన నేత్ర వైద్యుడు. డాక్టర్ బిసి సాంఘిక ఉపశమన రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ 2004 వ సంవత్సరంలో రాయ్ జాతీయ అవార్డు లభించింది. అయితే ఈ పాఠశాలలోని చిన్నారులను పలువురు రాజకీయ, సినీ ప్రముుఖులు, క్రీడాకారులతో పాటు దాతృత్వ వేత్తలు తరుచుగా సందర్శిస్తుంటారు.


కృతిశెట్టి ‘ఉప్పెన’ మూవీ తర్వాత నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ లోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత ‘బంగార్రాజు’ చిత్రంలో నాగచైతన్యతో నటించింది. మూడు చిత్రాలు విజయం సాధించడంతో టాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం రామ్ హీరోగా వచ్చిన ‘ది వారియర్’, నితిన్ హీరోగా వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’లో నటించి మంచి పేరు సాధించింది కృతిశెట్టి. 



Read Also: దట్టమైన అడవిలో కుక్కలతో పోరాటం, ఒళ్లు గగుర్పొడిచేలా ఆండ్రియా `నో ఎంట్రీ` ట్రైలర్