Bengaluru Rave Party Case: బెంగుళూరు రేవ్ పార్టీ విషయం కొన్నిరోజుల పాటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అందులో టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై కేసు కూడా నమోదు అయ్యింది. తాజాగా ఆ కేసులో హేమకు భారీగా ఊరట లభించింది. ప్రస్తుతం ఆమె.. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్నారు. ఇక జూన్ 12న హేమకు బెయిల్ మంజూరు అయినట్టు తెలుస్తోంది. బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు హేమకు బెయిల్ ఇచ్చింది. కానీ దాంతో పాటు పలు షరతులు కూడా పెట్టింది.


వాదనలు విన్న తర్వాత..


బెంగుళూరు రేవ్ పార్టీలో కేసుపై ఇటీవల బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టులో వాదనలు వినిపించాయి. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, చాలారోజుల తర్వాత పోలీసులు ఆమె బ్లడ్‌లో డ్రగ్స్ కంటెంట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపున న్యాయవాది మహేశ్ కిరణ్ శెట్టి వాదించారు. ఆయన వాదనలు విన్న తర్వాత కోర్టు.. హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది. దీంతో బెయిల్‌పై బయటికొచ్చిన హేమ.. ఈ కేసుపై ఏమైనా స్పందిస్తారేమో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు తనను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో కూడా తాను ఏ తప్పు చేయలేదనే చెప్తూ ఉన్నారు హేమ.


ఎక్కడికి వెళ్లలేదు..


బెంగళూరులో రేవ్ పార్టీ జరుగుతుందని, అక్కడ కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారనే వార్త ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇక అక్కడ ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలలో హేమ కూడా ఒకరని వార్త వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయం వైరల్ అయిన కొన్ని గంటల్లోనే దీనిపై స్పందించారు హేమ. తాను ఎక్కడికి వెళ్లలేదని, ఏ రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, హైదరాబాద్ ఫార్మ్ హౌజ్‌లో ఉన్నానని వీడియోను విడుదల చేశారు. కానీ ఆ వీడియో కూడా బెంగుళూరులో ఉండే రికార్డ్ చేశారని, తాను కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా ఆధారాలు ఉన్నాయని తనపై ఆరోపణలు వినిపించాయి. దీంతో హేమకు వైద్య పరీక్షలు నిర్వహించారు.


కెరీర్‌పై ఎఫెక్ట్..


వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలిందని వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు. హేమను విచారణకు తీసుకెళ్తున్న సమయంలో కూడా తనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అప్పుడు కూడా తాను బెంగుళూరులో పార్టీకి వెళ్లానని, కానీ పార్టీ అవ్వకముందే అక్కడి నుంచి వచ్చేశానని అన్నారు. పైగా తనకు అసలు ఏ వైద్య పరీక్షలు చేయలేదని ఆరోపించారు. అయినా కూడా పోలీసులు తనను కస్టడీలోకి తీసుకున్నారు. బెంగుళూరు రేవ్ పార్టీ రచ్చ హేమ కెరీర్‌పై కూడా ఎఫెక్ట్ చూపించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నుంచి హేమను తొలగిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.


Also Read: శివాజీకి వాళ్లు వార్నింగ్ ఇచ్చారా? ఎన్నికల ఫలితాలకు ముందే వైసీపీ ఓటమిపై వ్యాఖ్యలు, అవే నిజమయ్యాయిగా!