Thalapathy Vijay Party Flag Unveiled: తమిళ నటుడు, తలపతి విజయ్ తన పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన ఆయన తమిళగ వెట్రి కళగం (TVK) పేరిట పార్టీని స్థాపించారు. ఇవాళ ఆ పార్టీ జెండాని, గుర్తుని విడుదల చేశారు. ఎరుపు, పసుపు రంగులతో కూడిన ఈ జెండాలో మధ్యలో ఓ పువ్వు ఉంది. ఆ పువ్వుకి రెండు వైపులా ఏనుగులు ఉన్నాయి. పనయూర్‌లోని పార్టీ ఆఫీస్‌లో ఈ జెండాని (Tamilaga Vettri Kazhagam) ఆవిష్కరించారు విజయ్. ఈ జెండాలో మధ్యలో కనిపించే పువ్వు పేరు వాగాయ్ (Vaagai). చోళులు, పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వాళ్లకి ఈ పూలతోనే దండలు చేసి వాళ్లకి వేసే వాళ్లు. ఈ పూలని విజయానికి ప్రతీకగా చూసేవాళ్లు. ఇక ఈ జెండాపై తమిళ కవి తిరువళ్లువర్ రాసిన ఓ కొటేషన్ ఉంది. Pirapokkum Ella Uyirkkum అంటే..పుట్టుకతో అందరూ సమానమే అని అర్థం.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్టు వెల్లడించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో TVK పార్టీ ఏ కూటమికీ మద్దతునివ్వలేదు. ఆ ఎన్నికల్లో DMK క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటి నుంచి పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెడతానని చెప్పిన విజయ్, ఇకపై సినిమాలు చేయనంటూ సంచలన ప్రకటన చేశారు. ఆయన నటించిన GOAT మూవీ సెప్టెంబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. బహుశా ఈ సినిమాతోనే ఆయన సినీ కెరీర్‌కి శుభం కార్డు పడుతుండొచ్చు. తమిళనాడులో సినీ యాక్టర్లు రాజకీయాల్లోకి రావడం ఓ ఆనవాయితీగా వస్తోంది. నటుడు MGR రాజకీయాల్లోకి వచ్చి AIDMK పార్టీ స్థాపించారు. ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ తరవాత జయలలిత అదే స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు తలపతి విజయ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అభివృద్ధికి కలిసికట్టుగా శ్రమిద్దామని పిలుపునిచ్చారు.
"మీరంతా తొలి పార్టీ కాన్ఫరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను. ఇవాళ పార్టీ జెండాని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉంది. తమిళనాడు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేద్దాం. సామాజిక న్యాయమే నా లక్ష్యం. ఇదే బాటలో అంతా నడుద్దాం"
- విజయ్, నటుడు, టీవీకే పార్టీ చీఫ్