తెలుగు సినిమా రంగంలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శివాజీ రాజా. 1985లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తర్వాత ఎం.వి రఘు దర్శకత్వంలో వచ్చిన ‘కళ్లు’ సినిమా ద్వారా నటుడిగా మంచి పేరు సంపాదించారు. తర్వాత వరుసగా ఎన్నో సినిమాల్లో నటించిన శివాజీ కొన్నాళ్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) కు ప్రెసిడెంట్ గా చేశారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు.
నన్ను ప్రోత్సహించింది వాళ్లే : శివాజీ రాజా
సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చకున్న శివాజీ సహాయక పాత్రలే కాదు. పలు సినిమాల్లో హీరోగా కూడా చేశారు. ఓ వైపు సీరియస్ పాత్రలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్ గా కూడా రానించారు. అంతే కాదు ‘అమృతం’, ‘రాంబాబు’ వంటి కామెడీ సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు. సినిమా కెరీర్ గురించి శివాజీ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో తనను సీనియర్లు ఎంతో ప్రోత్సాహించారని అన్నారు. హీరోగా తాను ఓ పది సినిమాల వరకూ చేశానని, అందులో ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ లాంటి ఒకటి రెండు సినిమాలు బాగా ఆకట్టుకున్నాయని అన్నారు. నటుడు రంగనాథ్ తనతో సినిమా చేయాలని చెప్పి ఈ ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ సినిమా తెరకెక్కించారని అన్నారు. ఆయనతో పాటు చాలా మంది సీనియర్ దర్శకులు, నటులు తనను ఎంతగానో ప్రోత్సాహించి అవకాశాలు కల్పించారని అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి, రాఘవేంద్ర రావు, కృష్ణ వంశీ, ముత్యాల సుబ్బయ్య, రవిరాజా పినిశెట్టి, కోడి రామకృష్ణ, పెద్ద వంశీ, ఎం.వి రఘు, కోదండ రామిరెడ్డి లాంటి వారు ఎన్నో అవకాశాలు ఇచ్చారని అన్నారు. రాజేంద్ర ప్రసాద్, నాగబాబు లాంటి వారు తనను ప్రోత్సాహించారని అన్నారు.
దర్శకుడు పెద్ద వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉండేదని, కానీ తర్వాత తన స్థానంలో నటుడు నరేష్ ను తీసుకున్నారని అన్నారు. నరేష్ అప్పటికే పలు సినిమాలు చేశాడని, అందుకే తనను సెలెక్ట్ చేశారని అన్నారు. తర్వాత తనకు ‘కళ్లు’ సినిమా వచ్చిందని అన్నారు. అలాగే ‘అమృతం’ సీరియల్ లో కూడా మొదట కొన్ని ఎపిసోడ్ లు తాను చేశానని, తర్వాతే నరేష్ వచ్చి చేశాడని అన్నారు. తమకు వృత్తిపరంగా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమే అయినా నరేష్ తనకు స్నేహితుడనే చెప్పారు.
చిరంజీవి నామస్మరణ చేశా
మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో అభిమానం అని, మొదట్నుంచీ తాను ఇదే మాట చెప్తున్నానని అన్నారు. ఆయన కుటుంబంలో ఒకడిగా తాను ఉండేవాడినని, ఎన్నో సార్లు తాను అడిగితే ఎవరికైనా సాయం చేసేవారని అన్నారు. చిరంజీవి ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండటం వలన తనకు వేరే హీరోల సినిమాలు తక్కువగా వచ్చేవనడంలో కొంత నిజం ఉందన్నారు. అలాగని చిరంజీవి ఫ్యామిలీతో తాను ఎక్కువ సినిమాలలో నటించలేదని అన్నారు. ఎందుకంటే తానెప్పుడూ ఆయన్ను అవకాశాలు అడగలేదని, ఇప్పుడు ఇచ్చినా నటించే ఓపిక తగ్గిందని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఒక హీరోను ఎక్కువగా అభిమానించడం వలన అవకాశాలు తగ్గుతాయని ఇన్నాళ్లకు తెలిసిందని అన్నారు. కానీ తాను కొత్తగా ఇండస్ట్రీకు వచ్చేవాళ్లకి ఒకటి చెప్పదలచుకున్నానని అన్నారు. అదేంటంటే.. ఇండస్ట్రీలో న్యూటరల్ గా ఉండాలని, అభిమానం ఉంటే మనసులో దాచుకోవాలని లేకుంటే ఇండస్ట్రీలో గుర్తింపు తగ్గుతుందని సలహాఇచ్చారు శివాజీ.
Read Also: హోటల్ గదిలో యువనటి ఆత్మహత్య, ప్రేమ వ్యవహారమే కారణమా?