Prakash Raj: ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో జరుగునున్న అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఇటీవల కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ అక్కడ అధికార పార్టీ బీజేపీకు మద్దతు ప్రకటించడంతో అక్కడ రాజీకీయాలు మరింత వేడెక్కాయి. సుదీప్ బీజేపీకు మద్దతు ప్రకటించడం. వెంటనే ఆయనకు బెదిరింపు లేఖలు రావడం. దీనిపై సుదీప్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం. ఆ కేసు కాస్తా ఇప్పుడు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించడం ఇదంతా అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం తర్వాత కూడా సుదీప్ ప్రెస్ మీట్ పెట్టి తన మద్దతు సీఎం అభ్యర్థి బసవరాజు బొమ్మైకు ఉంటుందని చెప్పడంతో కన్నడ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. దీంతో అక్కడ ఉండే విపక్ష పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ కిచ్చా సుదీప్ బీజేపీ కు మద్దతు ప్రకటించడంపై స్పందించారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
నటుడు ప్రకాష్ రాజ్ కు దేశవ్యాప్తంగా ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన సోషల్ మీడియాలోనూ అంతే యాక్టీవ్ గా ఉంటారు. నిత్యం ఏదొక విషయంపై తన వాదనలు వినిపిస్తూ ఉంటారు. రాజకీయంగాను ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ, దాని విధివిధానాలపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇక సినిమా రంగంలో ఎవరైనా బీజేపీకు మద్దతుగా మాట్లాడితే వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. తాజాగా నటుడు కిచ్చా సుదీప్ వ్యవహారంపై కూడా ఆయన అలానే స్పందించారు. సుదీప్ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి బసవరాజు బొమ్మై కు మద్దతు ప్రకటించడం తనకు షాకింగ్ గా ఉందని అన్నారు ప్రకాష్ రాజ్. సుదీప్ ఎవరి వలలో పడేంత తెలివితక్కువ వాడు కాదని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు చేసి కొన్ని గంటలు గడవక ముందే ప్రకాష్ రాజ్ సుదీప్ పై మరో పోస్ట్ చేశారు. ‘‘డియర్ సుదీప్.. నటుడిగా నువ్వు అందరికీ చాలా ఇష్టం. నువ్వు ప్రజల గొంతుకవై నిలుస్తావని అనుకున్నాను. కానీ నువ్వు రాజకీయ రంగులను పులుముకుంటున్నావు. ఇప్పుడు ప్రజలు నిన్ను, నీ పార్టీని ప్రశ్నిస్తారు. సమాధానాలు చెప్పడానకి సిద్దంగా ఉండండి’’ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. అయితే ఈ ట్వీట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
గతంలో కూడా ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంతకముందు నటుడు విశాల్ కాశీను సందర్శించి అక్కడి ఏర్పాట్లు గురించి చెబుతూ బీజేపీ పరిపాలనను సమర్ధిస్తూ ఓ పోస్ట్ చేశారు. దానిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ కౌంటర్ ట్వీట్ చేశారు. అయితే దానిపై విశాల్ అంతగా స్పందించలేదు. ఈ విధంగా ప్రకాష్ రాజ్ బీజేపీ విధివిధానాలు, దాని మద్దతుదారులపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కిచ్చా సుదీప్ పై విమర్శలు చేశారని అంటున్నారు నెటిజన్స్. అయితే తాను బీజేపీకు ఎందుకు మద్దతు ఇస్తున్నానో ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకొచ్చారు సుదీప్. కేవలం తాను సీఎం అభ్యర్థి బొమ్మై కోసమే మద్దతు ఇస్తున్నానని, బమ్మై ను ఎప్పటినుంచో చూస్తున్నానని, సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా బొమ్మై ఆదుకున్నారని అన్నారు. దీన్ని రాజకీయం చేయొద్దని వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యవహారం ఎటునుంచి ఎటు దారితీస్తుందో చూడాలి.
Also Read : బాలకృష్ణతో సినిమా నా కోరిక, చిరుతో పూనకాలు లోడింగ్ - స్టార్స్‌తో సినిమాలపై 'దిల్' రాజు క్రేజీ అప్డేట్స్